మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈడీ అధికారుల సమన్లకు అనుగుణంగా ఆయన విచారణకు హాజరయ్యారు. రూ.17,000 కోట్ల మేర రుణ మోసాలతో పాటు నిధుల అక్రమ బదిలీలపై ఆయనను ప్రశ్నించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి గత నెల 24న ఈడీ అధికారులు రిలయన్స్ గ్రూప్ సంస్థలపై దేశవ్యాప్తంగా భారీ సోదాలు నిర్వహించారు. మొత్తం 35 ప్రాంతాల్లో 50 కంపెనీలపై మూడు రోజుల పాటు దర్యాప్తు చేపట్టి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీతో పాటు గ్రూప్‌కు చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్‌లకు కూడా నోటీసులు జారీ చేశారు.
అనిల్ అంబానీకి చెందిన కొన్ని కంపెనీలు భారీగా నిధులను విదేశాలకు తరలించిందని, అవి మనీలాండరింగ్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ చర్యలు తీసుకుంటోంది. అదే సమయంలో ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఈడీ ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. విచారణలో అనిల్ వాంగ్మూలాన్ని నమోదు చేసుకునే అవకాశముంది.