అమెరికా వేసిన దిగుమతి సుంకాలపై బ్రెజిల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ దేశ ఉత్పత్తులైన కాఫీ, బీఫ్, పెట్రోకెమికల్స్‌పై అమెరికా ఏకపక్షంగా 50 శాతం టారిఫ్ విధించడాన్ని తీవ్రంగా విమర్శించింది. దీనిని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో సవాలు చేయాలని బ్రెజిల్ ప్రభుత్వం నిశ్చయించింది. ఈ చర్యలతో తమ ఎగుమతులకు తీవ్ర ప్రభావం చూపుతోందని, దాదాపు 35 శాతం ఎగుమతులు దెబ్బతింటాయని బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేసింది.
తాజాగా బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ అంశంపై WTOలో అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఆమోదం తెలిపింది. తుది నిర్ణయాన్ని అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా తీసుకోనున్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే అసమాన భాగస్వామ్యం ఏ సందర్భంలోనూ అంగీకరించబోమని లూలా తేల్చి చెప్పారు.
అంతేకాదు, అమెరికా చర్యల ప్రభావంతో దేశీయంగా నష్టపోయే పరిశ్రమలకు ఉపశమన చర్యలుగా ఒక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్యాకేజీలో రుణ మద్దతు, సబ్సిడీలు వంటి ప్రయోజనాలు ఉండే అవకాశముంది. అమెరికా విధించిన సుంకాలు "అహేతుకమైనవని" ఆర్థిక మంత్రి ఫెర్నాండో హడ్డాడ్ పేర్కొన్నారు. బ్రెజిల్ వద్ద అరుదైన ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని కొత్త టెక్నాలజీలపై రెండు దేశాలు కలసి పనిచేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇంతలో, బ్రెజిల్‌లో ప్రజాస్వామ్య విలువలు తగ్గుతున్నాయని, అమెరికన్ సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణ చర్యలే టారిఫ్‌లకు కారణమని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను బ్రెజిల్ ఘాటుగా ఖండించింది. ఒకే పక్షపు నిర్ణయాలు WTO చట్టబద్ధమైన వ్యవస్థను బలహీనపరుస్తాయని, అంతర్జాతీయ వాణిజ్యాన్ని అస్థిరతకు గురిచేస్తాయని హెచ్చరించింది.