
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన ఆలయాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులు, బాటిళ్లు, డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు వంటి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పూర్తిగా నిషేధించబడింది. వీటి స్థానంలో కాటన్ బ్యాగులు, పేపర్ బ్యాగులు, స్టీల్ టంబ్లర్లు, స్టీల్ ప్లేట్లు, అరిటాకులు వంటి పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలి. అన్నప్రసాదం కూడా స్టీల్ ప్లేట్లు లేదా అరిటాకులలోనే భక్తులకు వడ్డించాల్సి ఉంటుంది.
మొదటి దశలో ఈ నిషేధాన్ని విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో అమలు చేయనున్నారు. ఆ తర్వాత మరో వందకు పైగా ప్రధాన ఆలయాలకు విస్తరించే ప్రణాళిక ఉంది. ప్లాస్టిక్ బాటిళ్ల వినియోగం తగ్గించేందుకు ఆలయాల ప్రాంగణంలో ఆర్వో వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించనున్నారు. ఇప్పటికే తిరుమలలో బయోడీగ్రేడబుల్ లడ్డూ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లపై నిషేధం అమలులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల ఆలయ పరిసరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గి, పర్యావరణహిత ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రోత్సాహం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 2022లోనే ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ అవి పూర్తిగా అమలు కాలేదు. కనకదుర్గమ్మ, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, కాణిపాకం, శ్రీశైలం వంటి ఆలయాల్లో ఈ నిబంధన అమలు చేయడానికి ఇప్పుడు మళ్లీ కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.