మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ.. కోర్టుకు తెలిపింది.
వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం.. వివేకా హత్యకేసుపై కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది.
గత నెల 21న విచారణ సందర్భంగా.. దర్యాప్తు సంస్థ సీబీఐని మూడు అంశాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే అవినాష్రెడ్డి సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ వివరాలను ఇవాళ సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.
వివేకా హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందో లేదో చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో సునీత, రాజశేఖర్ నర్రెడ్డిపై దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా అభిప్రాయం చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు కోరింది. వివేకా హత్య కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? అన్న విషయంపై కూడా సీబీఐ అభిప్రాయం చెప్పాలని అడిగింది.
అవినాష్రెడ్డి సహా హత్య కేసులో ఉన్న పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను సీబీఐ, సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినాష్ రెడ్డితో పాటు బెయిల్పై ఉన్న మిగతా నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారు.
హత్యకేసు దర్యాప్తు సీబీఐ అధికారి రామ్సింగ్, వివేకా కుమార్తె సునీత దంపతులపై నమోదైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణనలోకి కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్సింగ్, సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని గత విచారణ సందర్భంగా లూథ్రా కోర్టుకు తెలిపారు. హత్యకేసు సాక్షులను బెదిరిస్తున్న ప్రధాన నిందితుడు, స్థానిక ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు.