ప్రతిరోజూ అనేక మంది తమ పనుల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కులు, ఖాతా సంబంధిత సేవలు వంటి లావాదేవీల కోసం నేరుగా బ్యాంక్‌కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీలు సాధ్యమైనా, కొన్ని పనుల కోసం బ్యాంకుకు వెళ్లక తప్పదు.
ప్రతి నెలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఆగస్ట్ నెలలో కొన్ని కీలక తేదీల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్నాయి. బ్యాంకుకు వెళ్లే వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగానే గమనించి తమ లావాదేవీలను ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే, అనవసరమైన ఇబ్బందులు తప్పుతాయి. సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు రావు.
ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజుల వరుస సెలవులు ఉన్నాయి: ఆగస్ట్ 8, శుక్రవారం: సిక్కిం, ఒడిశా ప్రాంతాల్లో గిరిజన పండుగ (టెండాంగ్‌లో రమ్ ఫండ్), అలాగే వరలక్ష్మీ వ్రతం – ఈ కారణంగా బ్యాంకులకు సెలవు. ఆగస్ట్ 9, శనివారం: రెండో శనివారం – సాధారణంగా బ్యాంకులకు సెలవు. ఇదే రోజు రక్షాబంధన్ పండుగ కూడా జరుపుకుంటారు, బ్యాంకులు మూసే అవకాశం ఉంది. ఆగస్ట్ 10, ఆదివారం: ప్రతి ఆదివారం మాదిరిగా బ్యాంకులకు సెలవు.
అంతిమంగా, ఈ మూడు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జరుపుకునే పండగలు, సంస్కృతుల ఆధారంగా రాష్ట్రానికి ప్రత్యేకంగా సెలవులు ఉండొచ్చు. కనుక వినియోగదారులు తమ రాష్ట్రంలోని సెలవుల వివరాలు ముందుగానే తెలుసుకుని, బ్యాంకు పనులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.