యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో చారిత్రక ఘట్టాన్ని లిఖించింది. ఈ నెల 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీలు నమోదు కావడంతో యూపీఐ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇది భారత్‌ను రియల్ టైమ్ పేమెంట్స్ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది.
గత కొన్ని నెలలుగా యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. జూన్‌లో రోజుకు సగటున 62.8 కోట్ల లావాదేవీలు జరగగా, కేవలం కొన్ని వారాల్లోనే అది 70 కోట్లు దాటింది. జూలై నెల మొత్తంగా చూస్తే, 1,947 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.25.1 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 35% పెరుగుదల, మొత్తం విలువలో 22% వృద్ధి నమోదైంది. భవిష్యత్తులో రోజుకు 100 కోట్ల లావాదేవీలు నమోదు కావడమే తమ లక్ష్యమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. వినియోగదారులకు సులభతరం, వ్యాపారులకు ఉపయోగపడే విధంగా ఉండటమే ఈ పెరుగుదల కారణమని పేర్కొంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది వినియోగదారులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐను ఉపయోగిస్తున్నారు.
చార్జీల దిశగా అడుగులు.. యుపీఐ ఒకవైపు రికార్డులు తిరగరాస్తుంటే, మరోవైపు ఉచిత సేవల భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి పేమెంట్ అగ్రిగేటర్లపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. ఫోన్‌పే, గూగుల్ పే వంటి సంస్థల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ ఛార్జీలు నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపకపోయినా, భవిష్యత్‌లో పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల వ్యయాలను పెంచే అవకాశముంది. ఇతర బ్యాంకులు కూడా ఈ దిశగా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి.