ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగంలోకి దిగింది. శంషాబాద్ కాచారంలో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదు వివరాలు తెలియజేయాలని ఈడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను కోరింది. ఈ పరిణామం మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్‌గా మారింది. ఇప్పటికే అరెస్టైన నిందితుల స్టేట్‌మెంట్లలో జగన్ పేరు వస్తే, ఆయనపై అరెస్టు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇప్పటికే ఈ కేసులో రాజ్ కసిరెడ్డి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన ఈడీ, ఇటీవల చంద్ర రెడ్డిని కూడా విచారించింది. ఇప్పుడు రూ.11 కోట్ల నగదు స్వాధీనం కేసులో మరికొందరికి నోటీసులు ఇవ్వాలని సిద్ధమవుతోంది. ఒకవైపు సిట్, మరోవైపు ఈడీ విచారణ వేగవంతంగా సాగుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ స్కాం జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో జగన్ పాత్రపై ఊహాగానాలు మళ్లీ చురుకుగా మారాయి.
ఈ క్రమంలో మరో కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అతను A1 నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గ్యాంగ్‌లో ముఖ్యపాత్రధారి. కేసు నమోదు అయిన వెంటనే అతన్ని కొంతమంది సహాయంతో విదేశాలకు పంపించారని తెలుస్తోంది. అయితే విజయవాడ కోర్టు జారీ చేసిన నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఆధారంగా వరుణ్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుండి సిట్ అధికారులు కీలక సమాచారం పొందినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి సహా 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వరుణ్ విచారణతో మరికొన్ని ప్రాంతాల్లో సోదాలు జరగే అవకాశముంది. లిక్కర్ స్కాంలో నిధుల లావాదేవీలు, పాలిటికల్ లింకులు వెలుగులోకి వస్తుండటంతో ఈ కేసు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ కేసు ఎటు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.