భవిష్యత్తు డిజిటల్ చెల్లింపులకు దారితీసే విధంగా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక విప్లవాత్మక ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇప్పటివరకు యూపీఐ (UPI) ద్వారా చెల్లింపులకు పిన్, OTP లాంటి భద్రతా ప్రమాణాలు అవసరమయ్యేవి. కానీ త్వరలోనే, ఫేస్ ఐడీ, వేలిముద్రలు (Fingerprints), కనుపాపలు (Iris) వంటి బయోమెట్రిక్ ఆధారంగా చెల్లింపులు చేసేందుకు సదుపాయం అందుబాటులోకి రానుంది. అంటే, కంటిచూపుతోనే చెల్లింపులు చేయగలుగుతారు.
ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. NPCI ఇప్పటికే దీనిపై పనులు మొదలుపెట్టింది. ఇది అమలులోకి వచ్చిన తరువాత, QR కోడ్‌ను స్కాన్ చేసిన తరువాత పిన్ టైపు చేయాల్సిన అవసరం ఉండదు. బదులుగా, యూజర్లు తమ ముఖం లేదా వేలిముద్రను స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు పూర్తి చేయగలుగుతారు. ఇది ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల వారికి ఎంతో సహాయపడుతుంది, ఎందుకంటే వారు తరచూ పిన్ మర్చిపోతారు లేదా సాంకేతికతకు దూరంగా ఉంటారు.
బయోమెట్రిక్ ఫీచర్ వల్ల భద్రత మరింత మెరుగవుతుంది. ఎందుకంటే, ఒక్కో వ్యక్తి బయోమెట్రిక్ డేటా అనేది ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఇది మోసాలను నివారించడంలో సహాయపడుతుంది. పైగా, కొత్త ఫీచర్ వచ్చినా యూజర్లు పాత విధానాలైన పిన్ లేదా ఫేస్ ఐడీని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. వారి సౌలభ్యం మేరకు ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ఇప్పటికే డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. UPI వ్యవస్థ దేశ ఆర్థిక వ్యవస్థలోనే మార్పునకు నాంది పలికింది. ఈ తాజా బయోమెట్రిక్ ఫీచర్‌తో ఇండియాలో డిజిటల్ చెల్లింపులు మరింత వేగవంతమవనున్నాయి. NPCI ఈ ఫీచర్‌ను త్వరలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి, తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.