ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో అలరించిన హీరోయిన్ రాశి. 90వ దశకంలో అగ్రనటుల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. బొద్దుగా, ముద్దుగా ఉంటూ, పెదవులపై చెరగని చిరునవ్వుతో కుర్రాళ్ల కలల రాకుమారిగా నిలిచారు.
అయితే, కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని వెండితెరకు దూరమయ్యారు. తాజాగా, జబర్దస్త్ వర్ష నిర్వహిస్తున్న 'కిస్సిక్ టాక్స్' షోకు హాజరైన రాశి తన జీవితంలో ఎదురైన కష్టాలు, ఆనందాలను పంచుకుని ఎమోషనల్ అయ్యారు. ఆమె చెప్పిన విషయాలు చాలామందిని కదిలించాయి.
రాశి అసలు పేరు రవళి. కానీ సినీ రంగంలోకి వచ్చిన తర్వాత విజయలక్ష్మిగా, ఆ తర్వాత రాశిగా పేరు మార్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రాశి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. 'రావు గారి ఇల్లు', 'బాల గోపాలుడు', 'ఆదిత్య 369' వంటి సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించారు. ఆ తర్వాత తమిళంలో 'ప్రియం' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు.
తెలుగులో 'గోకులంలో సీత', 'శుభాకాంక్షలు', 'పండుగ', 'డాడి డాడీ' వంటి అనేక సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాదు, 'సముద్రం', 'వీడే' వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌తోనూ ప్రేక్షకులను అలరించారు.
కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే రాశి 2005లో శ్రీ ముని అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ ప్రేమను ఇంట్లో వాళ్ళు తొలుత ఒప్పుకోలేదని, తన అన్నయ్య చాలా కోపంగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత వారికి పాప జన్మించింది. ఆ పాప పుట్టడం తన జీవితంలో జరిగిన ఒక మ్యాజిక్ అని రాశి ఎమోషనల్ అయ్యారు. పాపకు జన్మనిచ్చేటప్పుడు బాగా బరువు పెరిగానని, చాలా రిస్కీ డెలివరీ జరిగిందని కూడా తెలిపారు.
పెళ్లి తర్వాత సినిమాలకు చాలాకాలం బ్రేక్ ఇచ్చి, తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు తల్లి, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెరపైనా అడుగుపెట్టి 'గిరిజ కళ్యాణం', 'జానకి కలగనలేదు' వంటి సీరియల్స్‌లో నటించారు.
రాశి తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ ఒక డైరెక్టర్ వల్ల తన జీవితం ఎలా నాశనమైందో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ డైరెక్టర్ తన లుక్ మార్చమని, 'మగరాయుడు'లా ఉండాలని, బరువు తగ్గమని చెప్పి ట్రైనర్‌ను పెట్టారని తెలిపారు. కానీ, మొదటి రోజు షూటింగ్‌లో చేయకూడని సీన్ పెట్టేశాడని, ఆ సీన్స్ చూసి ప్రేక్షకులు చాలా నిరాశ చెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సినిమా తర్వాత తను మరే సినిమా చేయలేదని, ఆ సినిమా తన కెరీర్‌కు ఫుల్ స్టాప్ వేసిందని చెప్పారు. "ఆడపిల్ల ఉసురు పోసుకోకూడదు" అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ డైరెక్టర్ ఎవరంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తన ఫేవరెట్ యాక్టర్ అని, 'గోకులంలో సీత 2' చేయాలనుకుంటున్నానని చాలాసార్లు ఆయనకు చెప్పానని తెలిపారు. అలాగే, తన 21వ పుట్టినరోజుకు చిరంజీవి ఐ బ్యాంక్‌కు తన కళ్లు దానం చేశానని, తనను చూసి చాలామంది అమ్మాయిలు కూడా కళ్లు దానం చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు.