డిసెంబర్ 14న దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి సామాన్యులు, పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర 1, 35000 రూపాయల స్థాయికి చేరువలో ఉంది. గత నాలుగు నుంచి ఐదు రోజుల్లోనే తులం బంగారం ధర దాదాపు ఐదు వేల రూపాయల వరకు పెరగడం గమనార్హం. భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ధరల పెరుగుదల సామాన్య కుటుంబాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది వివాహాలు, శుభకార్యాల సీజన్ దగ్గరపడుతున్న వేళ ఈ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది.
ప్రధాన నగరాల్లోని ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,34,070గా నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,900గా ఉంది. ముంబైలో 24 క్యాఏలరెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,910 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,750గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వంటి నగరాల్లో కూడా దాదాపు ఇదే స్థాయి ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో మాత్రం స్వల్పంగా ఎక్కువగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,950గా నమోదు కావడం విశేషం.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,910గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,22,750గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలో వెండి ధర దాదాపు రూ.1,98,000 వద్ద కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు దేశీయంగా బంగారం ధరలు సుమారు 67 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు దాదాపు 60 శాతం పెరిగినట్లు లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్‌తో పోలిస్తే రూపాయి స్థితి వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే 2026లో కూడా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రూపాయి డాలర్‌తో పోలిస్తే బలహీనంగా కొనసాగితే లేదా అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు పెరిగితే బంగారం ధరలు మరో 5 నుంచి 16 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే దీర్ఘకాల పెట్టుబడుల కోసం చాలామంది బంగారాన్ని ఎంచుకుంటున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మొత్తంగా చూస్తే బంగారం, వెండి ధరల పెరుగుదల ఒకవైపు పెట్టుబడిదారులకు లాభదాయకంగా కనిపిస్తున్నా, మరోవైపు సామాన్య వినియోగదారులకు భారంగా మారుతోంది. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, కేంద్ర బ్యాంకుల విధానాలు ధరల దిశను నిర్ణయించనున్నాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే ముందు ధరలను గమనిస్తూ, అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.