అమెరికా–పాకిస్తాన్ మధ్య మరోసారి భారీ ఆయుధ ఒప్పందం కుదిరింది. పాకిస్తాన్‌కు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాల అప్‌గ్రేడ్, నిర్వహణ, ఆధునిక సాంకేతిక మద్దతు కోసం అమెరికా ప్రభుత్వం 686 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందానికి ఆమోదం తెలిపింది. భారత కరెన్సీలో ఇది రూ.6200 కోట్లకు పైగా ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన ఈ డీల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ యూఎస్ కాంగ్రెస్‌కు అధికారికంగా తెలియజేసింది. ఈ ఒప్పందం ద్వారా అమెరికా–పాకిస్తాన్ సైనిక సంబంధాలు మరింత బలపడతాయని పేర్కొంది.
ఈ ఆయుధ ఒప్పందం ప్రధానంగా ఎఫ్-16 ఫైటర్ జెట్ల పనితీరు మెరుగుదలపై దృష్టి సారించింది. ఇందులో లింక్-16 కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, అధునాతన ఎన్క్రిప్షన్ పరికరాలు, అప్‌గ్రేడ్ చేసిన ఏవియానిక్స్, పైలట్ ట్రైనింగ్, పూర్తి స్థాయి లాజిస్టికల్ సపోర్ట్ ఉన్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పాకిస్తాన్ వైమానిక దళానికి నిఘా, లక్ష్య గుర్తింపు, గగనతల నియంత్రణ, ఆయుధాల సమన్వయం వంటి కీలక సామర్థ్యాలు మరింత పెరుగుతాయి. అలాగే అమెరికా, మిత్ర దేశాల దళాలతో కలసి ఆపరేషన్లు నిర్వహించేందుకు పాక్ ఎయిర్ ఫోర్స్‌కు ఇది ఉపయోగపడనుంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎఫ్-16 యుద్ధ విమానాలను 2040 సంవత్సరం వరకు పొడిగించనున్నారు. విమానాల్లో ఉన్న భద్రతా లోపాలను సరిదిద్దడంతో పాటు ఆధునికీకరణ చేపట్టనున్నారు. అమెరికా ప్రభుత్వంతో పాటు అక్కడి కాంట్రాక్టర్లు పాకిస్తాన్‌కు ఇంజనీరింగ్, టెక్నాలజీ, లాజిస్టిక్స్ సహాయాన్ని అందించనున్నారు. భవిష్యత్‌లో ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, భద్రతా ఆపరేషన్లలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందని అమెరికా అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అయితే భారత్‌కు ఇటీవలే భారీ రక్షణ సహాయం అందించిన అమెరికా, వెంటనే పాకిస్తాన్‌తో ఇలాంటి ఒప్పందం కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని వారాల క్రితం భారత్‌కు హోమ్‌ల్యాండ్ డిఫెన్స్ బలోపేతం కోసం 93 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఆ ప్యాకేజీలో జావెలిన్ మిసైల్ సిస్టమ్‌లు, సంబంధిత పరికరాలు, 216 ఎక్స్‌కాలిబర్ వ్యూహాత్మక రౌండ్లు ఉన్నాయి. ఈ పరిణామాలతో దక్షిణాసియా భద్రతా పరిస్థితులపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.