రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. 2026 సంవత్సరానికి సంబంధించిన పూర్తి జాబ్ క్యాలండర్‌ను RRB అధికారికంగా విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏ నెలలో ఏ ఉద్యోగానికి నోటిఫికేషన్ వస్తుందో ముందుగానే స్పష్టత ఇవ్వడంతో లక్షలాది అభ్యర్థులకు ఇది పెద్ద ఊరటగా అదేవిధంగా ప్రిపరేషన్ కి షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడానికి మంచి అవకాశం గా మారింది. గతంలో నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియక అయోమయం నెలకొనేది. ఇప్పుడు ఆ పరిస్థితికి ముగింపు పలికినట్లయ్యింది.
తాజాగా విడుదల చేసిన క్యాలండర్ ప్రకారం, 2026 ఫిబ్రవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. రైల్వేలో కీలకమైన ఈ ఉద్యోగాలకు ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. ఆ తర్వాత మార్చి నెలలో టెక్నీషియన్, సెక్టార్ కంట్రోల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. ఏప్రిల్ నెలలో సెక్షన్ కంట్రోలర్ పోస్టుల ప్రకటన విడుదల చేయనున్నట్లు RRB తెలిపింది.
ఇదే క్రమంలో జూలై 2026లో పారామెడికల్ స్టాఫ్‌తో పాటు జూనియర్ ఇంజనీర్ (JE) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ పోస్టులకు ఇంజినీరింగ్, మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ పడే అవకాశం ఉంది. ఆగస్టు నెలలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC) పోస్టులకు నోటిఫికేషన్ రానుంది. క్లర్క్, గూడ్స్ గార్డ్, స్టేషన్ మాస్టర్ వంటి ఉద్యోగాలు ఈ కేటగిరీలో ఉంటాయి.
సెప్టెంబర్ 2026లో మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో టీచింగ్, లాబ్ అసిస్టెంట్ వంటి ప్రత్యేక విభాగాల ఉద్యోగాలు ఉంటాయి. చివరగా అక్టోబర్ 2026లో లెవల్-1 గ్రూప్ డీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. గ్రూప్ డీ ఉద్యోగాలు గ్రామీణ, పట్టణ యువతకు పెద్ద ఉపాధి అవకాశంగా నిలుస్తాయి.
ప్రతి సంవత్సరం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ విధంగా ముందస్తు జాబ్ క్యాలండర్‌ను విడుదల చేయడం వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ఏ నెలలో ఏ పరీక్ష ఉంటుందో తెలిసినందున చదువు, రివిజన్, మాక్ టెస్టులు అన్నీ క్రమబద్ధంగా చేసుకోవచ్చు. గతంలో నోటిఫికేషన్ల మధ్య అనిశ్చితి ఉండటంతో చాలా మంది సరైన ప్రణాళిక లేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇప్పుడు ఆ సమస్య చాలా వరకు తగ్గిందని అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు.
సాధారణంగా రైల్వే పరీక్షల్లో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే ఈ అంశాలపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్, ప్రాథమిక గణితం, తార్కిక శక్తిని పెంచే అంశాలపై పట్టు సాధిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. మొత్తంగా RRB 2026 జాబ్ క్యాలండర్ నిరుద్యోగ యువతకు దిశానిర్దేశం చేసే రోడ్‌మ్యాప్‌లా మారిందని చెప్పవచ్చు.