పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 16వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఈ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాలు సాధించిన యువతలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.
డిసెంబర్ 16న జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం హోం మంత్రి వంగలపూడి అనిత స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. డీఐజీ ఏసుబాబు, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబుతో కలిసి పరేడ్ గ్రౌండ్‌ను సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. అభ్యర్థులు, వారి కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రత, పార్కింగ్, సీటింగ్ ఏర్పాట్లు సక్రమంగా ఉండేలా అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
మరోవైపు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 22 నుంచే శిక్షణ ప్రారంభం కానుంది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ప్రభుత్వం పరీక్షలు నిర్వహించగా, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం 5,551 మందికి ‘ఫిట్ ఫర్ ట్రైనింగ్’ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఈ అభ్యర్థులకు మొత్తం 9 నెలల పాటు రెండు దశలుగా శిక్షణ అందించనున్నారు. తొలి దశలో నాలుగున్నర నెలల పాటు ప్రాథమిక శిక్షణ ఇవ్వగా, ఆ తర్వాత వారం రోజుల పాటు విరామం కల్పిస్తారు. అనంతరం రెండో దశగా మరో నాలుగున్నర నెలల పాటు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ నిర్వహిస్తారు.
ఈ శిక్షణలో పోలీస్ విధులకు అవసరమైన అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కల్పించనున్నారు. శారీరక దారుఢ్యం, డ్రిల్, ఆయుధాల వినియోగం, నిఘా పద్ధతులు, చట్టాలపై అవగాహన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలాగే ప్రజలతో వ్యవహరించే తీరు, క్రమశిక్షణ, బాధ్యతాయుత ప్రవర్తనపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. శిక్షణ పూర్తయ్యాక పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించి, అనంతరం అభ్యర్థులకు పోస్టింగులు కేటాయించనున్నారు. ఈ నియామకాలు రాష్ట్ర పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.