బంగ్లాదేశ్‌లో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారత వ్యతిరేక కార్యకర్తగా పేరొందిన షరీఫ్ ఉస్మాన్ హదీ హత్యకు నిరసనగా ప్రారంభమైన ఆందోళనలు క్రమంగా హింసాత్మక రూపం దాల్చాయి. ముఖ్యంగా చిట్టగాంగ్ నగరంలో ఈ నిరసనలు తీవ్రంగా చెలరేగాయి. ఆందోళనకారులు భారత సహాయ హైకమిషన్ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాళ్ల దాడికి పాల్పడటంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, హదీ మరణవార్త వెలుగులోకి వచ్చిన వెంటనే పెద్ద సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. చిట్టగాంగ్‌లోని భారత దౌత్య కార్యాలయం, అధికారిక నివాసం పరిసరాల్లో గుమిగూడిన ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు నినాదాలు చేశారు. కొన్ని చోట్ల వాహనాలకు నిప్పు పెట్టినట్లు, దహనకాండలు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.
హింస చెలరేగిన నేపథ్యంలో నిరసనకారులు మీడియా సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. దేశంలోని ప్రముఖ పత్రికలైన ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’ కార్యాలయాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. కొన్నిచోట్ల కార్యాలయాలకు నిప్పు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ధన్‌మండిలో ఉన్న బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసంపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఛాయానాట్ సాంస్కృతిక భవన్‌పై జరిగిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగించింది.
చిట్టగాంగ్‌తో పాటు రాజ్‌షాహీ, ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరిణామాలు భారత్–బంగ్లాదేశ్ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారత దౌత్య కార్యాలయాల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు సమాచారం. పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం అదనపు బలగాలను రంగంలోకి దింపగా, శాంతిభద్రతలు పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.