ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. అమరావతిలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో పోలీస్ శాఖకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా అసంబద్ధమైన ట్రాఫిక్ చలానాలు విధించొద్దని ఆదేశించారు. చట్టం అమలవ్వాలి కానీ అది ప్రజలకు భారం కావద్దన్నారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన సీఎం, సమీక్షలు కేవలం మొక్కుబడికే కాదని, ఫలితాలు కనిపించాల్సిందేనని హెచ్చరించారు. తప్పు చేసినవారిలో పోలీసులంటే భయం ఉండాలే తప్ప, చట్టబద్ధంగా నడిచే సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రౌడీజం, మహిళలపై నేరాలు పూర్తిగా అంతమవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. “రౌడీలు అనే పదమే రాష్ట్రంలో ఉండకూడదు” అంటూ నోటోరియస్ రౌడీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలని సూచించారు. జిల్లాల వారీగా ప్రొఫెషనల్ రౌడీలను గుర్తించి ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని, లొంగని వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళల భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణను మరింత విస్తృతంగా అందించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే 22.5 శాతం తగ్గడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు.
ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్‌లపై కూడా పోలీస్ శాఖ మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఫోరెన్సిక్ వ్యవస్థను ఆల్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. తీరప్రాంత భద్రత కోసం తక్షణమే బోట్ల కొనుగోలు జరగాలని, డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ద్వారా 15 నిమిషాల్లో బాధితుల వద్దకు పోలీసులు చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. ప్రతి రోడ్డు ప్రమాదంపై సమీక్ష జరిపి, బ్లాక్ స్పాట్లను సరిదిద్దాలని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారం, ఫేక్ అకౌంట్ల ద్వారా వ్యక్తిత్వ హననం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ అంశంపై మంత్రుల కమిటీతో అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో 15 శాతం ఆర్థిక వృద్ధి సాధించాలంటే శాంతి భద్రతలు కీలకమని పేర్కొన్నారు. నేరాలపై అలక్ష్యం వహిస్తే ప్రభుత్వానికే నష్టం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ, ప్రజాప్రయోజనాలకు విఘాతం కలిగించే నేరాలపై ఎస్పీలు, కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. అధికారంలో ఉండి కూడా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో నమ్మకం కోల్పోతామని హెచ్చరించారు.