ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది 2026 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించనున్నట్లు ప్రకటించింది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించి, పర్యావరణానికి హాని కలగకుండా చూడడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని 17 పుర, నగరపాలక సంస్థల్లో ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది. ఇప్పుడు ఈ నిషేధాన్ని మిగిలిన 96 పట్టణాలకు కూడా విస్తరించనున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్ ఈ విషయాన్ని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ఇచ్చిన ప్రజెంటేషన్‌లో నిషేధ అమలు విధానం, లక్ష్యాలను వివరించారు.
ఈ నిషేధం అమలుతో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, స్ట్రాలు వంటి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పూర్తిగా నిలిపివేయనున్నారు. ఇప్పటికే నిషేధం అమలులో ఉన్న ప్రాంతాల్లో ప్రజలు, వ్యాపారులు మంచి సహకారం అందిస్తున్నారని అధికారులు తెలిపారు. మిగిలిన పట్టణాల్లో కూడా ఇదే స్థాయి సహకారం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయాలను వినియోగించాల్సిందిగా ప్రజలకు సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాబోయే మూడున్నరేళ్లలో వ్యర్థాల సమస్యను సున్నా స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందించే స్వచ్ఛత అవార్డులన్నీ రాష్ట్రానికి వచ్చేలా కృషి చేయాలని, ప్రతి జిల్లా కలెక్టర్ తమ పరిధిలోని ఒక పట్టణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని తెలిపారు. నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్వచ్ఛత కార్యక్రమాలను బలోపేతం చేయాలని ఆదేశించారు.
అమరావతి, తిరుమలను జీవవైవిధ్య కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న 89 శాతం పచ్చదనాన్ని 100 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. అంతరించిపోతున్న మొక్కలను తిరిగి అభివృద్ధి చేసే కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశిస్తూ, ఈ చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే స్వచ్ఛమైన రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది.