పాకిస్థాన్‌లోని గ్వాదర్ పోర్టును అంతర్జాతీయ స్థాయిలో కీలక వ్యూహాత్మక కేంద్రంగా మార్చే దిశగా సౌదీ అరేబియా భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. పాకిస్థాన్ ప్రభుత్వంతో కలిసి గ్వాదర్ పోర్టు అభివృద్ధికి సౌదీ అధికారికంగా ఒప్పందం కుదుర్చుకుంది. అధికారికంగా చూస్తే ఈ ఒప్పందం వాణిజ్యం, లాజిస్టిక్స్, సముద్ర రవాణా అభివృద్ధి లక్ష్యంగా ఉందని చెబుతున్నా, దీని వెనుక లోతైన భౌగోళిక–రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యూహాత్మక వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో చైనా కీలక పాత్ర ఉందన్న వాదన ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఈ ఒప్పందంలో భాగంగా గ్వాదర్ పోర్టులో సౌదీ అరేబియా భారీగా పెట్టుబడులు పెట్టనుంది. గ్వాదర్–కరాచీ కోస్టల్ హైవేను ఆధునీకరించి సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, కరాచీ, గ్వాదర్, జెడ్డా, దమ్మామ్‌లను కలుపుతూ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. అంతేకాదు, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నియోమ్ (NEOM) సిటీతో పాటు గ్వాదర్, కరాచీ, జెడ్డాలను కలుపుతూ సంయుక్త మారిటైమ్ టూరిజం కారిడార్‌ను కూడా ప్రతిపాదించింది. ఇది మధ్యప్రాచ్యం – దక్షిణాసియా మధ్య వాణిజ్య, పర్యాటక రవాణాను మరింత బలోపేతం చేసేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించే భాగంగా గ్వాదర్‌లో ‘రీజనల్ మారిటైమ్ ఫ్యూజన్ అండ్ రెస్పాన్స్ సెంటర్’ను ఏర్పాటు చేయాలని సౌదీ–పాక్ నిర్ణయించాయి. ఈ కేంద్రం ద్వారా ఇరాన్, ఒమన్, గల్ఫ్ దేశాలతో కలిసి సంయుక్త నౌకాదళ విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో గ్వాదర్ పోర్టు కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా, భవిష్యత్తులో సైనిక సమన్వయానికి కీలక కేంద్రంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే అంశం భద్రతా నిపుణులను ఆందోళనకు గురి చేస్తోంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, అరేబియా సముద్రంలో సౌదీ ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత సెప్టెంబరులో పాకిస్థాన్‌తో సౌదీ కుదుర్చుకున్న సైనిక ఒప్పందం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. బీజింగ్ అనుమతి లేకుండా పాకిస్థాన్‌లో పెద్ద స్థాయి వ్యూహాత్మక నిర్ణయాలు జరగవని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. తైవాన్, భారత్‌తో భవిష్యత్తులో తలెత్తే ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని, మలక్కా జలసంధికి ప్రత్యామ్నాయ మార్గంగా చైనా ఈ ఆర్థిక–సైనిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తోందని హెచ్చరిస్తున్నారు. గ్వాదర్‌లో సౌదీ ప్రభావం పెరగడం అరేబియా సముద్రం, హార్ముజ్ జలసంధి, హిందూ మహాసముద్రంలో దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రభావం చూపే అంశంగా మారవచ్చని, ఇది భారత్‌కు భవిష్యత్తులో కొత్త సవాళ్లను విసిరే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.