రైతులకు వరం.. సరికొత్త భూగర్భ బిందు సేద్యంతో నీరు, ఎరువుల ఆదా! 15 ఏళ్లకు పైగా మన్నిక!
New Irrigation Technology: వ్యవసాయ రంగంలో నీటి కొరత, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు రైతులకు ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఆధునిక సాగు సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా భూగర్భ బిందు సేద్యం (Sub-Surface Drip Irrigation – SSDI) రైతులకు ప్రయోజనకరమైన విధానంగా నిలుస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతపై న్యూఢిల్లీలోని పూసాలో ఉన్న భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఈ విధానంతో నీటి వినియోగ సామర్థ్యం 90 శాతానికి, పోషకాల వినియోగ సామర్థ్యం 80 శాతానికి చేరుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.
- భూగర్భ బిందు సేద్యంతో 90 శాతం వరకు నీటి వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశం.
- నీరు, ఎరువుల ఆదాతో పాటు పంట దిగుబడులు పెరిగే ప్రయోజనం.
New Irrigation Technology: వ్యవసాయ రంగంలో నీటి కొరత, పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు రైతులకు ప్రధాన సవాళ్లుగా మారుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా ఆధునిక సాగు సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా భూగర్భ బిందు సేద్యం (Sub-Surface Drip Irrigation – SSDI) రైతులకు ప్రయోజనకరమైన విధానంగా నిలుస్తోంది. ఈ సరికొత్త సాంకేతికతపై న్యూఢిల్లీలోని పూసాలో ఉన్న భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI) శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ఈ విధానంతో నీటి వినియోగ సామర్థ్యం 90 శాతానికి, పోషకాల వినియోగ సామర్థ్యం 80 శాతానికి చేరుతుందని పరిశోధనల్లో వెల్లడైంది.
భూమి లోపలే డ్రిప్ పైపులు
సాధారణ డ్రిప్ సేద్యంలో పైపులను భూమిపై ఏర్పాటు చేసి మొక్కలకు నీటిని అందిస్తారు. అయితే భూగర్భ బిందు సేద్యంలో పంటల వేర్ల విస్తరణను బట్టి 20 నుంచి 70 సెంటీమీటర్ల లోతులో డ్రిప్ పైపులను అమరుస్తారు. వీటి ద్వారా నీరు, ద్రవ రూపంలోని ఎరువులు నేరుగా మొక్కల వేర్లకు చేరుతాయి. దీంతో నీరు ఆవిరైపోవడం, ఇతర రూపాల్లో వృథా కావడం తగ్గుతుంది. నీటితోపాటు ఎరువులను అందించే ఫెర్టిగేషన్ విధానం కూడా ఇందులో కీలకంగా ఉంటుంది.
నీరు, ఎరువుల వినియోగంలో పొదుపు
భూగర్భ డ్రిప్ విధానంతో మొక్కలకు అవసరమైన తేమ, పోషకాలు నిరంతరం అందుతాయి. మొక్కజొన్న, గోధుమ పంటల్లో సాధారణ సాగు పద్ధతితో పోలిస్తే సుమారు 54 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే నత్రజని ఎరువుల వినియోగాన్ని 20 నుంచి 50 శాతం వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. మొక్కజొన్నలో 20–25 శాతం, గోధుమలో 28–58 శాతం వరకు అదనపు దిగుబడులు పొందవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పైపుల మన్నిక కూడా ఎక్కువే!
సాధారణ డ్రిప్ పైపులు ఎండకు గురికావడం, ఎలుకలు కొరకడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. భూగర్భ డ్రిప్ విధానంలో పైపులు నేల లోపల ఉండటంతో ఈ ఇబ్బందులు గణనీయంగా తగ్గుతాయి. సాధారణ డ్రిప్ పైపుల జీవితకాలం 6–8 ఏళ్లు కాగా, భూగర్భ డ్రిప్ లైన్లు 10–15 ఏళ్ల వరకు మన్నికగా పనిచేస్తాయి. ప్రతి పంట మారినప్పుడు పైపులను తొలగించి మళ్లీ ఏర్పాటు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో కూలీల ఖర్చు, నిర్వహణ భారం తగ్గుతాయి.
ప్రారంభ పెట్టుబడి కొంత ఎక్కువ
ఈ సాంకేతికతలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. భూగర్భంలో పైపులు ఏర్పాటు చేయడానికి ప్రారంభంలో సాధారణ డ్రిప్తో పోలిస్తే ఎక్కువ పెట్టుబడి అవసరం. అలాగే పైపుల్లో అడ్డంకులు ఏర్పడకుండా నీటిలో పూర్తిగా కరిగే ఎరువులనే వినియోగించాలి. ప్రతి పంట కాలం ముగిసిన తర్వాత పైపులను శుభ్రం చేయడం, ఫిల్టర్లను నిర్వహించడం తప్పనిసరి.
రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం
భూగర్భ బిందు సేద్యం దీర్ఘకాలంలో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దక్షిణ భారతదేశంలోని వాతావరణ పరిస్థితులు, వివిధ రకాల పంటలు, పండ్ల తోటలకు అనుగుణంగా మరిన్ని క్షేత్రస్థాయి పరిశోధనలు జరగాల్సి ఉంది. సాధారణ డ్రిప్ సేద్యానికి అందిస్తున్న తరహాలోనే ఈ ఆధునిక విధానానికి కూడా ప్రభుత్వాలు సబ్సిడీలు కల్పిస్తే రైతులకు మరింత మేలు జరుగుతుంది. ముఖ్యంగా నీటి ఎద్దడి, కరువు పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవడానికి ఈ సాంకేతికత ఉపయోగపడే అవకాశముంది
Tags
1 readers have reacted