Kollu Ravindra: పేదలకు అండగా సీఎం సహాయ నిధి.. మచిలీపట్నంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర!

Kollu Ravindra: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మానవీయ పాలన అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Minister Kollu Ravindra
Minister Kollu Ravindra

పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొల్లు రవీంద్ర..

సీఎం సహాయ నిధితో నిరుపేద కుటుంబాలకు అండగా ప్రభుత్వం..

మచిలీపట్నం: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రభుత్వం మానవీయ పాలన అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

శనివారం మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మచిలీపట్నం 39వ డివిజన్‌కు చెందిన చెన్నూరు నాగరాజు లివర్ మార్పిడి చికిత్స కోసం మంజూరైన రూ.6 లక్షల చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అలాగే గూడవల్లి గంగా నాగేంద్రరావు కుమార్తె మోకాలి చికిత్స కోసం మంజూరైన రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మచిలీపట్నం నియోజకవర్గంలో ఇప్పటివరకు 918 మంది లబ్ధిదారులకు రూ.8,64,48,239 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి అందించినట్లు తెలిపారు. అదేవిధంగా ఎల్వోసీ (L.O.C.) విధానం ద్వారా వైద్య చికిత్స పొందిన వారికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలిచిందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాలకు భారీగా నిధులు కేటాయిస్తూ పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తోందని మంత్రి వివరించారు. ప్రజలకు మరింత సమగ్ర వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇటీవల ‘సంజీవని’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో, ఏ ఆసుపత్రిలో చికిత్స పొందినా అర్హులైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు భరోసాగా నిలవడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రతి పౌరుడు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలిచి ఆర్థిక భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest