APCO: త్వరలో ఆప్కో, చేనేత సహకార సంఘాల ఎన్నికలు.. ‘నేతన్న సేవలో’ రూ.25 వేల సాయం!

APCO: రాష్ట్రంలోని చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఆప్కో (APCO) ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేతన్నల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు.

APCO Elections
APCO Elections

ముందుగా చేనేత సహకార సంఘాలకు.. తర్వాత ఆప్కో ఎన్నికలు..

అర్హులైన ప్రతి నేతన్నకు రూ.25 వేల 'నేతన్న సేవలో' ఆర్థిక సాయం..

చీరాల: రాష్ట్రంలోని చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి, అనంతరం ఆప్కో (APCO) ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. చేనేత కార్మికుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నేతన్నల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు.

చీరాలలోని పద్మశాలీ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య రాష్ట్రస్థాయి జయంతి వేడుకల్లో మంత్రి సవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మద్దులూరి మాల కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సిసోడియా, కమిషనర్ రేఖారాణి, బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చేనేత సహకార సంఘాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. ముందుగా సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత ఆప్కో ఎన్నికలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. బలోపేతమైన సహకార సంఘాల ద్వారా నేతన్నలకు మెరుగైన మార్కెటింగ్, ఉపాధి అవకాశాలు, ఆర్థిక భద్రత కలుగుతాయని ఆమె పేర్కొన్నారు. గతంలో పెండింగ్‌లో ఉన్న సహకార సంఘాల బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లిస్తోందని వెల్లడించారు.

ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా చేనేత కుటుంబాలకు మరింత అండగా నిలవాలనే ఉద్దేశంతో ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. వచ్చే నెల ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం అమలులో వయస్సు పరిమితి లేకుండా అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రయోజనం కల్పిస్తామని స్పష్టం చేశారు.

చేనేత కార్మికుల జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి సవిత చెప్పారు. 50 ఏళ్లు దాటిన నేతన్నలకు నెలకు రూ.4 వేల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఎన్నికల హామీ మేరకు మగ్గం నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గం కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు. చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

చేనేత ఉద్యమానికి జీవితాంతం అంకితభావంతో సేవలందించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య సేవలను మంత్రి సవిత గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రాజ్యసభ సభ్యుడిగా చేనేత కార్మికుల సమస్యలను శాసనసభల్లో ప్రస్తావిస్తూ వారి హక్కుల కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. నాలుగు చేనేత సత్యాగ్రహాలకు నాయకత్వం వహించిన మహోన్నత వ్యక్తిగా ఆయనను అభివర్ణించారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతో చీరాల స్పిన్నింగ్ మిల్‌కు శంకుస్థాపన చేయించిన ఘనత కూడా ప్రగడ కోటయ్యదేనని పేర్కొన్నారు.

ప్రగడ కోటయ్య సేవలను భావితరాలకు చేరవేసేందుకు ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అలాగే అమరావతిలో రూ.10 కోట్ల వ్యయంతో ప్రగడ కోటయ్య స్మృతివనం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను కూడా చీరాలలో నిర్వహించే అవకాశం ఉందని చెప్పారు.

గత వైసీపీ ప్రభుత్వం చేనేతల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసిందని మంత్రి సవిత విమర్శించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలను రద్దు చేసి, ‘నేతన్న నేస్తం’ పథకాన్ని కూడా అర్హతలతో సంబంధం లేకుండా అమలు చేశారని ఆరోపించారు. అర్హులైన నేతన్నలతో పాటు వైసీపీ కార్యకర్తలకు కూడా ఆర్థిక సాయం అందించారని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలోనే చేనేత రంగానికి నిజమైన ప్రోత్సాహం లభించిందని ఆమె పేర్కొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో మంత్రి సవిత ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారుడు వెంకటశేషసాయి, కోడలు పద్మావతి, కుమార్తె, అల్లుడు తదితర కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చేనేత రంగానికి కొత్త ఊపు తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నేతన్నల్లో ఆశలు రేకెత్తిస్తున్నాయి.

Tags

Be the first to react

Latest