ఏపీలో ఎల్ నినో ప్రభావం.. యాక్షన్ ప్లాన్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష!

El Niño Impact in AP: ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకుని సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా అన్ని వ్యవస్థలపై పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలతో వ్యవహరించాలని సూచించారు.

El Nino Impact in AP
El Nino Impact in AP

ఎల్ నినో ప్రభావంతో 79 శాతం భూముల్లోనే ఖరీఫ్ సాగు.. పరిస్థితిపై చంద్రబాబు సమీక్ష..

ఏపీలో 50.7 శాతం లోటు వర్షపాతం.. ఎల్ నినోపై సీఎం చంద్రబాబు కీలక సూచనలు..

ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసుకుని సిద్ధం చేసిన యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా అన్ని వ్యవస్థలపై పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలతో వ్యవహరించాలని సూచించారు. రైతులను ఆదుకోవడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

అమరావతి నుంచి వివిధ శాఖల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు, రైతు భరోసా కేంద్రాల (ఆర్ఎస్కే) సిబ్బందితో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితులు, ఇప్పటికే తీసుకున్న చర్యలు, రానున్న రోజుల్లో అమలు చేయాల్సిన యాక్షన్ ప్లాన్‌పై సమీక్షించారు.

రైతులను కాపాడటంతో పాటు ధరల నియంత్రణపై దృష్టి

ఎల్ నినో ప్రభావం నుంచి రైతులను కాపాడే ప్రయత్నం చేస్తూనే వినియోగదారులపై ధరల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. బియ్యం, ఉల్లి, పామాయిల్, కందిపప్పు వంటి నిత్యావసరాల ధరలను నియంత్రణలో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

గోడౌన్లలో బియ్యం నిల్వలు ఎంత మేరకు ఉన్నాయో ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అవసరమైన సమయంలో నిల్వలను మార్కెట్‌లోకి విడుదల చేసి ధరలను అదుపులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఉల్లి సాగును ప్రోత్సహించాలని సూచించారు.

పామాయిల్, కందిపప్పు ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలకు కనీస మద్దతు ధర అందిస్తున్నందున ఈ అంశంలో కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు సాగు చేసేలా అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు వర్షాభావ పరిస్థితులను తట్టుకునే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

సంప్రదాయేతర ప్రాంతాల్లో కూడా ఉల్లి, మిరప సాగును చేపట్టేలా ప్రోత్సహించాలని సూచించారు. డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగు, పశుగ్రాసం పెంపకం, మల్చింగ్ కోసం విత్తనాలు జల్లడం వంటి చర్యలను చేపట్టాలని చెప్పారు.

పంటల బీమా పరిహారం రైతులకు అందాలి

రైతులకు ఇప్పటికే పంటల బీమా చేయించినందున పంట నష్టం సంభవిస్తే అర్హులైన రైతులకు బీమా పరిహారం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎల్ నినో పరిస్థితులను సవాలుగా స్వీకరించి రైతులకు నష్టం తగ్గించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

వర్షాధార పంటలు, ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. వర్షాధార పంటలతో పాటు ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.

కిచెన్ గార్డెన్లను కూడా విస్తృతంగా ప్రోత్సహించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా కూరగాయలను పండించేలా చర్యలు తీసుకుంటే స్థానికంగా కూరగాయల లభ్యత పెరిగి ధరలను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కిచెన్ గార్డెన్లను వ్యవస్థీకృతం చేసే దిశగా అధికారులు పనిచేయాలని సూచించారు.

హార్టికల్చర్ పంటలకు రూ.190 కోట్లు

కొన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలపై అధిక రిస్క్ ఉందని సీఎం తెలిపారు. అలాంటి హైరిస్క్ ప్రాంతాల్లో ఉద్యాన పంటలను కాపాడేందుకు రూ.190 కోట్లు కేటాయించామని, ఈ నిధులను సక్రమంగా, అవసరమైన చోట పూర్తిస్థాయిలో వినియోగించాలని అధికారులను ఆదేశించారు.

తాగునీరు, పశుగ్రాసానికి ఇబ్బంది రాకూడదు

ఎల్ నినో పరిస్థితుల్లో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. పశువులకు నీటితో పాటు పశుగ్రాసం అందేలా చూడాలని ఆదేశించారు. పచ్చదనం ఏ మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

వీబీ జీ రామ్ జీ పనులను అనుసంధానం చేసుకుంటూ జలధార కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేయాలని సూచించారు. విపత్తులు సంభవించినప్పుడు వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చూడటం ప్రభుత్వాల బాధ్యత అని, అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు, వినియోగదారులు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టం చేశారు.

50.7 శాతం లోటు వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 50.7 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందని సీఎం తెలిపారు. ప్రకాశం, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో లోటు వర్షపాతం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.

ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 30.84 లక్షల హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. ఎల్ నినో ప్రభావంతో ఇప్పటివరకు 79 శాతం భూముల్లోనే సాగు పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. పప్పు ధాన్యాల సాగు పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ నూనె గింజల సాగు తక్కువగా ఉందని తెలిపారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పంటలపై ఎల్ నినో ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని పేర్కొన్నారు.

కంటింజెన్సీ ప్రణాళిక అమలుపై దృష్టి

ఇప్పటికే సిద్ధం చేసిన కంటింజెన్సీ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 5.21 లక్షల హెక్టార్లకు సరిపడా పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువులను సరఫరా చేసినట్లు తెలిపారు. 1.31 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 80 శాతం సబ్సిడీతో అందించామని చెప్పారు. ఖరీఫ్ కంటింజెన్సీ ప్రణాళిక కోసం రూ.60 కోట్లు సిద్ధంగా ఉంచినట్లు వివరించారు.

అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని సీఎం సూచించారు. స్థానిక ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎల్ నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతుల్లో అవగాహన కల్పించాలని కోరారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు సమన్వయంతో పనిచేయాలి

ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కోవడంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, రైతులు, సాగునీటి సంఘాలు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల వైపు రైతులను మళ్లించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

సాగునీటి చర్యలపై సీఎం ప్రస్తావన

కరవు ప్రభావిత ప్రాంతాలకు నీటిని తరలించేందుకు ఇప్పటికే తీసుకున్న నిర్ణయాలు ఉపయోగపడుతున్నాయని సీఎం తెలిపారు. హంద్రీ-నీవా ద్వారా చివరి భూములకు కూడా నీరందించామని, ప్రస్తుతం తాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ప్రభుత్వం ముందస్తుగా చేపట్టిన చర్యల కారణంగానే ఎల్ నినో వంటి పరిస్థితుల్లోనూ హంద్రీ-నీవా కాల్వల్లో నీరు ప్రవహిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. రూ.3,500 కోట్ల వ్యయంతో 100 రోజుల్లో హంద్రీ-నీవా కాల్వల్లో నీటిని పారించగలిగామని తెలిపారు.

గత ప్రభుత్వాల సాగునీటి వ్యయాలపై సీఎం వ్యాఖ్యలు

2014–19 మధ్య కాలంలో సాగునీటి రంగానికి రూ.65 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2019–24 మధ్య అప్పటి ప్రభుత్వం కేవలం రూ.22 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ఎల్ నినో వంటి విపత్తులు వచ్చిన సమయంలో ప్రజలు, రైతులు ఎదుర్కొనే ఇబ్బందులు మరింత తగ్గేవని ఆయన వ్యాఖ్యానించారు.

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తాత్కాలిక, మధ్యంతర ప్రణాళికలతో ముందుకు సాగాలని సీఎం సూచించారు. రైతులను కాపాడటం, నిత్యావసరాల ధరలను నియంత్రించడం, తాగునీరు–పశుగ్రాసం అందుబాటులో ఉంచడం, డిమాండ్‌కు అనుగుణంగా పంటల సాగును ప్రోత్సహించడం వంటి అంశాలపై శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

Tags

Be the first to react

Latest