భారతదేశంలో శీతాకాలం మొదలైన వెంటనే మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడం కొంత కష్టసాధ్యంగా మారుతుంది. ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే వరల్డ్ డయాబెటీస్ డే ఈ వ్యాధి తీవ్రతను గుర్తు చేస్తూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 1990లో 200 మిలియన్ మంది ఉన్న మధుమేహ రోగుల సంఖ్య 2022 నాటికి 830 మిలియన్‌కు పెరిగింది. భారతదేశం అత్యధిక కేసులతో డయాబెటీస్ క్యాపిటల్ గా పిలవబడి శీతాకాలం సమయంలో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.
వైద్యుల ప్రకారం చలి అధికమవుతుంటే శరీరంలో సహజంగానే క్రియాశీలత తగ్గుతుంది. ప్రజలు బయటకు వెళ్లి నడవడం తగ్గించడంతో వ్యాయామం కొరవడుతుంది. చలి కారణంగా వేడి ఆహారం స్వీట్లు పదార్థాలపై మక్కువ పెరుగుతుంది. ఇవన్నీ రక్తంలో చక్కెర స్థాయీలను పెంచే అవకాశాలు ఎక్కువ. మరోవైపు శీతాకాలంలో ఫ్లూ, దగ్గు, శ్వాస సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి ఇన్ఫెక్షన్లు మధుమేహాన్ని మరింత అస్థిరం చేసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా అందడం వల్ల విటమిన్ D తగ్గిపోతుంది. ఇది ఇన్సులిన్ స్పందనపై ప్రభావం చూపుతుంది. శీతాకాలం రోజులు ఎండ తక్కువగా ఉంటుంది అందువల్ల ఎక్కువ సమయం గదుల్లోనే గడపడం వల్ల ఒత్తిడి, అలసట కూడా పెరుగుతాయి. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ఈ పరిస్థితుల్లో మధుమేహం ఉన్నవారు తమ శరీరాన్ని అర్థం చేసుకొని జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం.
ఇలాంటి చలి సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను తరచుగా పరిశీలించడం చాలా ముఖ్యం. మీటర్‌తో లేదా CGMS పరికరంతో రెగ్యులర్‌గా చెక్ చేస్తే ఆహారం, మందులు, వ్యాయామం శరీరంపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలుసుకోవచ్చు. రీడింగులు క్రమం తప్పకుండా ఎక్కువగా లేదా తక్కువగా వస్తే వెంటనే వైద్యులను సంప్రదించి మందుల మోతాదును మార్చుకోవాలి. అలాగే ఫ్లూ, న్యుమోనియా వ్యాక్సిన్‌లు తీసుకోవడం శీతాకాలంలో మరింత రక్షణ కల్పిస్తుంది.
బయట నడవడం కష్టమైతే ఇంట్లోనే యోగా, మెట్లు ఎక్కడం, లైట్ ఎక్సర్‌సైజులు చేయడం ద్వారా శరీర చురుకుదనం కొనసాగుతుంది. మధ్యాహ్నం సమయంలో సూర్యరశ్మి కొంత అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శీతాకాలంలో పాద సంరక్షణ కూడా అత్యంత కీలకం. చలి గాలికి చర్మం ఎండిపోవడం వల్ల చిట్లిపోవడం గాయం కావడం త్వరగానే జరుగుతుంది. రోజూ పాదాలను పరిశీలించి వేడి సాక్స్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆహారంలో పాలకూర, మెంతికూర, ఆమ్లా, వెల్లుల్లి వంటి చలి కాలపు సహజ పదార్థాలు చేర్చుకోవడం శరీరానికి మంచిది. విటమిన్ C ఉన్న జామ, స్ట్రాబెర్రీ, బెల్ పెప్పర్ వంటి పండ్లు ఉపయోగపడతాయి. అయితే పండుగలు, వేడుకలు ఎక్కువగా ఉండే ఈ కాలంలో నెయ్యి పరాఠా, హల్వా, దీప్ ఫ్రైడ్ స్నాక్స్ ఇష్టపడినా వాటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
రక్తంలో చక్కెర స్థాయిలు అసాధారణంగా పెరుగుతున్నా లేదా అతి తక్కువవుతున్నా, పాదంలో గాయం త్వరగా నయం కాకపోయినా, అలసట, నిరుత్సాహం ఎక్కువగా కనిపించినా వెంటనే వైద్య సహాయం తీసుకోవడం అవసరం. సరైన జాగ్రత్తలతో శీతాకాలాన్ని ఆరోగ్యంగా గడిపే అవకాశం పూర్తిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.ఈ సమాచారం కేవలం మీ అవగాహనకు మాత్రమే ముందుగా మీ డాక్టర్ ని సంప్రదించవలెను.
World Diabetes Day శీతాకాలంలో మధుమేహం నియంత్రణ కష్టతరం!! వరల్డ్ డయాబెటీస్ డే సందర్బంగా నిపుణుల ముఖ్య సూచనలు!!