ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం ‘సదరం’ కింద స్లాట్ బుకింగ్‌లు ఈ నెల 14 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గత సెప్టెంబరు చివరి నుంచి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ ప్రక్రియను ప్రభుత్వం తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్న సుమారు 10 వేల మందికి ముందుగా స్లాట్లు కేటాయిస్తారు. తరువాత కొత్త దరఖాస్తుదారులకు అవకాశమివ్వనున్నారు.
ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్ కోసం రూ.40, సర్టిఫికేట్ ప్రింటింగ్ కోసం రూ.40 తీసుకునేవారని, ఇకపై ఈ ఫీజులను పూర్తిగా రద్దు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగుల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వైకల్య ధృవీకరణ సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు పూర్తిగా ఉచితమయ్యింది.
సదరం కింద వైకల్య నిర్ధారణ పరీక్షలు సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం, జిల్లా, ప్రాంతీయ, బోధనా ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం నిర్వహించబడతాయి. డిసెంబరు నెలాఖరు నాటికి 31,050 మందికి ఈ పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 112 ఆసుపత్రుల్లో పరీక్షలు జరిగితే, ఈసారి అదనంగా ఆరు ఆసుపత్రులను చేర్చారు.
కాళ్లు, చేతుల సమస్యలు, కంటి చూపు లోపం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మందబుద్ధి వంటి విభాగాల్లో ఉన్న దివ్యాంగులకు వైద్యులు వారి వైకల్య శాతాన్ని అంచనా వేసి ధృవపత్రాలను జారీ చేస్తారు. ఈ ధృవపత్రాల ఆధారంగా పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది.
గతంలో తక్కువ శాతం గా నిర్ధారించబడి అప్పీల్ చేసిన లక్షా 4 వేల మందిలో ఇప్పటివరకు 19,235 మందికి రీ-ఎగ్జామినేషన్ పూర్తయింది. మిగిలిన వారందరికీ డిసెంబరు నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు వెల్లడించారు. అలాగే పింఛన్ పొందుతున్న వారిలో 1.87 లక్షల మందికి రీ-అసెస్‌మెంట్ పరీక్షలు జనవరి నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.