క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించడమే లక్ష్యం.. దుబ్బాకలో తానా ఫౌండేషన్ ఉచిత స్క్రీనింగ్ క్యాంప్

దుబ్బాక: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేరువ చేయాలనే ఉద్దేశంతో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు. తానా ఫౌండేషన్ ప్రధాన సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శిబిరానికి దివ్య సుగూర్, అనీశ్ సుందర్, సుందర్ గోపినాథ్ ఆర్థిక సహకారం అందించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్య సేవలు అందించగా, గాడిపల్లి ఫౌండేషన్ స్థానికంగా సహకరించింది

Tana Foundation Cancer camp in Dubbaka
Tana Foundation Cancer camp in Dubbaka
  • గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు, ఆరోగ్య సేవలు.
  • గ్రామీణ ప్రజలకు చేరువగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు.. పెద్ద సంఖ్యలో హాజరు.
  • గ్రామీణ ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి మరిన్ని వైద్య, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేపడతామని తానా వెల్లడి.


దుబ్బాక: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేరువ చేయాలనే ఉద్దేశంతో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుబ్బాక పట్టణంలో ఉచిత మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించారు. తానా ఫౌండేషన్ ప్రధాన సమన్వయంతో జరిగిన ఈ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ శిబిరానికి దివ్య సుగూర్, అనీశ్ సుందర్, సుందర్ గోపినాథ్ ఆర్థిక సహకారం అందించారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్య సేవలు అందించగా, గాడిపల్లి ఫౌండేషన్ స్థానికంగా సహకరించింది.

శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు, వైద్య సిబ్బంది క్యాన్సర్‌కు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం, సకాలంలో వైద్యులను సంప్రదించడం, తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరీక్షల అనంతరం వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

సమన్వయంతో నిర్వహణ

ఈ కార్యక్రమాన్ని తానా న్యూజెర్సీ కోఆర్డినేటర్ సుధీర్ నరేపలుపు, తానా కోశాధికారి రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ సతీశ్ మేక సమన్వయం చేశారు. వర్ష నరేపలుపు వాలంటీర్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తూ స్వచ్ఛంద సేవకుల సేవలను సమన్వయం చేశారు. వైద్య బృందాలు, వివిధ సంస్థలు, స్థానిక ప్రతినిధుల మధ్య సమన్వయంతో శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా గాడిపల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రఘువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద ప్రజలకు సేవ చేయడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమన్నారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గంలో గాడిపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

పేద ప్రజలకు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని, వారికి సాధ్యమైనంత సహాయం అందించేందుకు ముందుంటానని రఘువర్ధన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని సేవా కార్యక్రమాలు

తానా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ నల్లూరి, తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ఉపయోగపడే కార్యక్రమాలకు తానా ప్రాధాన్యత ఇస్తోందన్నారు. భవిష్యత్తులోనూ గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి సహకరించిన దాతలు, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్య బృందం, గాడిపల్లి ఫౌండేషన్, వైద్యులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలకు తానా నాయకత్వం కృతజ్ఞతలు తెలిపింది.

Tags

Be the first to react

Latest