ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విస్తుపోయే భద్రతా వైఫల్యం – ఎయిరిండియాకు DGCA నోటీసులు!

DGCA Sends Notice To Air India: ఢిల్లీ విమానాశ్రయంలో తప్పనిసరి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు అమృత్‌సర్ నుంచి వచ్చి మ్యూనిచ్ విమానం ఎక్కి వెళ్లిపోవడంపై పౌర విమానయాన శాఖ ఎయిరిండియాకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. హబ్ అండ్ స్పోక్ ఎస్‌వోపీ నిబంధనలను ఉల్లంఘించినట్లు పేర్కొంటూ వారం రోజుల్లో వివరణ కోరింది. ఈ భద్రతా లోపంపై కేంద్ర హోం శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎయిరిండియా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించింది.

ఎయిరిండియాకు DGCA నోటీసులు
ఎయిరిండియాకు DGCA నోటీసులు
  • పాస్‌పోర్ట్ తనిఖీల్లేవ్.. స్టాంపింగ్ లేదు..?: ముగ్గురు ఇటాలియన్ పౌరుల మిస్టరీ ప్రయాణంపై రచ్చ!

  • లుఫ్తాన్సా ఫ్లైట్ ఎక్కేదాకా ఎవరూ చూడలేదా..?: ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ డొల్లతనం బట్టబయలు!

  • వారం రోజుల్లో సమాధానం చెప్పాల్సిందే..?: లేదంటే కఠిన చర్యలంటూ ఎయిరిండియాకు అల్టిమేటం!

DGCA Sends Notice To Air India: దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యంత తీవ్రమైన భద్రతా, ఇమ్మిగ్రేషన్ నిబంధనల ఉల్లంఘన వెలుగుచూసింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు తప్పనిసరిగా నిర్వహించాల్సిన డిపార్చర్ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ ప్రక్రియను పూర్తి చేయకుండానే ముగ్గురు విదేశీ పౌరులు అంతర్జాతీయ విమానం ఎక్కి జర్మనీకి వెళ్లిపోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోర తప్పిదంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమానయాన సంస్థ 'ఎయిరిండియా' (Air India)కు షోకాజ్ నోటీసులు జారీ చేశాయి.

అమృత్‌సర్ నుంచి మ్యూనిచ్ వరకు సాగిన ప్రయాణం

ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. భారత సంతతికి చెందిన ముగ్గురు ఇటాలియన్ పౌరులు (సుర్జీత్ సింగ్, బల్విందర్ కౌర్, గురుదేవ్ సింగ్) అమృత్‌సర్ నుంచి ఎయిరిండియా విమానం ద్వారా అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఎయిరిండియా కోడ్‌షేర్ భాగస్వామి అయిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ విమానంలో వారు జర్మనీలోని మ్యూనిచ్ నగరానికి వెళ్లాల్సి ఉంది. అయితే ఢిల్లీలో ల్యాండ్ అయిన గంట వ్యవధిలోనే వారు అంతర్జాతీయ విమానం ఎక్కి దేశం దాటి వెళ్లిపోయారు.

నిబంధనలు గాలికొదిలేసిన గ్రౌండ్ స్టాఫ్ – 'హబ్ అండ్ స్పోక్' విధానంలో తప్పిదం

దేశీయ ప్రయాణికులుగా అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వచ్చిన ఈ ముగ్గురిని, అంతర్జాతీయ విమానం ఎక్కే ముందు ఢిల్లీ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల వద్దకు తీసుకెళ్లి పాస్‌పోర్ట్ ఎగ్జిట్ స్టాంపింగ్ వేయించాల్సిన బాధ్యత ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ఉంది. అయితే ఎయిరిండియా సిబ్బంది వారిని తప్పుగా గైడ్ చేసి నేరుగా అంతర్జాతీయ బదిలీ ప్రాంతం (I-to-I Transfer Area) గుండా లుఫ్తాన్సా గేట్ వద్దకు తీసుకెళ్లినట్లు తేలింది. ఎయిర్‌లైన్స్ అమలు చేస్తున్న 'హబ్ అండ్ స్పోక్' స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ను పూర్తిగా ఉల్లంఘించడమే కాకుండా, బోర్డింగ్ పాస్‌ల జారీ మరియు అంతర్జాతీయ ప్రయాణికుల విభజనలో ఐదు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినట్లు మంత్రిత్వ శాఖ గుర్తించింది.

రంగంలోకి కేంద్ర హోం శాఖ – అత్యున్నత స్థాయి సమీక్ష

భారతదేశ సరిహద్దులను దాటి విదేశీయులు ఇలా నిఘా తనిఖీలు లేకుండా వెళ్లిపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత తీవ్రమైన జాతీయ భద్రతా లోపంగా పరిగణించింది. కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో హోం వ్యవహారాలు, పౌర విమానయాన శాఖ ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) డైరెక్టర్, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ కమిషనర్, ఎయిరిండియా సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ మరియు ఢిల్లీ విమానాశ్రయ ఆపరేటర్ డయల్ (DIAL) ఉన్నతాధికారులతో అత్యవసర ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సరిహద్దు భద్రతా ప్రొటోకాల్స్‌ను కఠినతరం చేయాలని నిర్ణయించారు.

వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అల్టిమేటం

ఈ వ్యవహారంలో జరిగిన లోపాలపై వారం రోజుల్లోగా రాతపూర్వక వివరణ సమర్పించాలని ఎయిరిండియా యాజమాన్యానికి కేంద్ర విమానయాన శాఖ స్పష్టమైన గడువు విధించింది. నిర్దేశిత సమయంలోగా సంతృప్తికరమైన సమాధానం రాకపోతే, ఎయిర్‌లైన్స్‌కు ఎటువంటి సంజాయిషీ లేదని భావించి కఠినమైన నియంత్రణ మరియు పరిపాలనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ఘోర నిర్లక్ష్యం బయటపడటం విమానయాన రంగంలో చర్చనీయాంశంగా మారింది.

Tags

Be the first to react

Latest