సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కూరగాయ. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, కడుపు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అందుకే ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారు తమ రోజువారీ ఆహారంలో సొరకాయను చేర్చుకుంటున్నారు.
బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ రసం మంచి ఎంపికగా పరిగణిస్తారు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉండటంతో పాటు కొవ్వు శాతం అస్సలు ఉండదు. ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, ఎక్కువగా తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో అనవసరమైన చిరుతిళ్లకు దూరంగా ఉండి బరువు నియంత్రణ సాధ్యమవుతుంది.
సొరకాయ రసం మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. శరీరంలో జీవక్రియ రేటు పెరిగితే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరచి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. మూత్రం, వ్యర్థాల ద్వారా శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లేందుకు ఇది దోహదపడుతుంది.
PCOD / PCOS సమస్యలు ఉన్నవారికీ సొరకాయ రసం ఉపయోగకరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీరంలోని మంటను తగ్గించి హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుందని భావిస్తున్నారు. అయితే దీనిని అల్లం, పుదీనా లేదా తులసి గింజలతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది.
సొరకాయ రసం తాగేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. చేదుగా ఉన్న సొరకాయ రసం అస్సలు తాగకూడదు. పాడైపోయిన సొరకాయ రసం వాంతులు, కడుపు నొప్పి, అతిసారం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా అలర్జీ ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా దీనిని తీసుకోకూడదు. ఈ రసం ఆరోగ్యానికి మేలు చేస్తుందిగానీ, వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.