ఆంధ్రప్రదేశ్‌లో పాస్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. డిసెంబర్ 24వ తేదీలోగా ఈ మొత్తం పాస్టర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. క్రైస్తవుల భద్రత, గౌరవానికి ఎలాంటి భంగం కలగనివ్వబోమని, ప్రతి మతాన్ని సమానంగా గౌరవిస్తామని సీఎం తెలిపారు.
విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేక్ కట్ చేసి, క్యాండిల్ వెలిగించి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రపంచానికి ప్రేమ, శాంతి, సేవ సందేశాన్ని అందించిన యేసు క్రీస్తు బోధనలు ఎప్పటికీ మార్గదర్శకమని అన్నారు. సమాజంలో శాంతి మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ తత్వాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
గత ఐదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని సీఎం తెలిపారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రాష్ట్రాన్ని తిరిగి నిలదొక్కుకునే స్థితికి తీసుకొచ్చామని చెప్పారు. ఇచ్చిన హామీల మేరకు ‘సూపర్ సిక్స్’ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని, క్రైస్తవుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించామని వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు పథకం, స్కాలర్‌షిప్‌లు, ఆటో డ్రైవర్లకు సాయం వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.
ప్రత్యేకంగా క్రైస్తవ మైనారిటీల కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.22 కోట్లతో 44,812 మంది క్రైస్తవులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,427 మంది పాస్టర్లకు నెలకు రూ.5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నామని, మే 2024 నుంచి నవంబర్ 2024 వరకు రూ.30 కోట్లు విడుదల చేశామని చెప్పారు. అలాగే డిసెంబర్ 2024 నుంచి నవంబర్ 2025 వరకు రూ.51 కోట్లను ఈ నెల 24లోగా ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.
భవిష్యత్తులో కూడా క్రైస్తవుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. 2025–26లో రూ.20 కోట్లతో 2,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. చర్చిల నిర్మాణానికి నిధులు, క్రిస్టియన్ భవనాల పూర్తి, జెరూసలేం యాత్రకు ఆర్థిక సాయం వంటి పథకాలను కొనసాగిస్తామని చెప్పారు. క్రిస్టియన్ విద్యా సంస్థలు సమాజ సేవలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించిన సీఎం, పేదరికం లేని సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.