ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేత కార్మికులకు మరో శుభవార్త తెలిపింది. చేనేతల ఆదాయాన్ని పెంచడంతో పాటు పని సులభతరం చేయాలనే లక్ష్యంతో ‘జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (ఎన్‌హెచ్‌డీపీ)’ కింద ఆధునిక పరికరాలను భారీ రాయితీతో అందిస్తోంది. ఈ పథకంలో పరికరాల ధరలో 90 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తుండగా, మిగిలిన 10 శాతం మాత్రమే కార్మికులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం క్లస్టర్లలో ఉన్నవారితో పాటు వ్యక్తిగతంగా చేనేత వృత్తిని నడిపే వారికి కూడా వర్తిస్తుంది.
ఈ పథకం కింద చేనేత కార్మికులకు 26 రకాల ఆధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. మోటరైజ్డ్ జకార్డ్ మిషన్లు, ఫ్రేమ్ మగ్గాలు, 120/140 జకార్డ్ మిషన్లు, అచ్చుసెట్లు, నూలు చుట్టే యంత్రాలు వంటి పరికరాలు ఇందులో ఉన్నాయి. వీటి ధరలు రూ.3,500 నుంచి రూ.లక్ష వరకు ఉంటాయి. ఉదాహరణకు రూ.లక్ష విలువైన పరికరాన్ని కేవలం రూ.10 వేల చెల్లింపుతో పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఈ ఆధునిక పరికరాల వల్ల చేనేత కార్మికుల శ్రమ గణనీయంగా తగ్గనుంది. ఫ్రేమ్ మగ్గాల వాడకంతో గుంత మగ్గాల్లో ఎదురయ్యే ఇబ్బందులు తొలగిపోతాయి. మోటరైజ్డ్ జకార్డ్ మగ్గాల వల్ల కాళ్లతో నొక్కాల్సిన అవసరం లేకుండా పని సులభమవుతుంది. అలాగే 120 జకార్డ్ మిషన్లతో కొత్త డిజైన్లు రూపొందించి, చీరలకు మంచి ఆకర్షణ కల్పించవచ్చని, దీంతో మార్కెట్లో మంచి ధర లభిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఈ పథకం కింద పరికరాలు పొందాలనుకునే చేనేత కార్మికులు తమ జిల్లాలోని సహాయ సంచాలకుడు (ఏడీ) కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ కార్డు, చేనేత గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, తాజా ఫోటోలు తప్పనిసరిగా సమర్పించాలి. దరఖాస్తుల తర్వాత కేంద్ర, రాష్ట్ర అధికారులతో కూడిన బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హతను నిర్ధారిస్తుంది. ఆ నివేదిక ఆధారంగా పరికరాల మంజూరు జరుగుతుంది.
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు 10 ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ.30 లక్షలు కావడంతో రాష్ట్రానికి ఏడాదికి దాదాపు రూ.3 కోట్ల నిధులు అందనున్నాయి. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 900 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా, స్థలం ఉన్న చేనేతలకు షెడ్ నిర్మాణానికి 100 శాతం రాయితీతో రూ.70 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు, అలాగే రూ.15 వేల విలువైన లైటింగ్ సెట్‌ను కూడా ఉచితంగా అందించనున్నట్లు అధికారులు తెలిపారు.