అల్లూరి సీతారామరాజు జిల్లా–ఒడిశా సరిహద్దులో ఉన్న బలిమెల జలాశయం మరోసారి వార్తల్లో నిలిచింది. సీలేరు జల విద్యుత్ కేంద్రానికి నీటిని అందించే ఈ భారీ జలాశయం ఏఓవీ ప్రాంతానికి ఆనుకుని ఉండటంతో ఇక్కడి గిరిజన మత్స్యకారులు నిత్యం చేపల వేటకు వస్తుంటారు. అడవులు, కొండల మధ్య విస్తరించి ఉన్న ఈ రిజర్వాయర్‌లో పలు రకాల చేపలు లభిస్తుండటంతో మత్స్యకారులకు ఇది ప్రధాన జీవనాధారంగా మారింది. సాధారణ రోజుల్లోనే కాకుండా ఆదివారం కూడా మత్స్యకారులు వేటకు వెళ్లడం పరిపాటే.
ఇలాగే ఆదివారం ఉదయం ఒడిశాలోని మల్కనగిరి జిల్లా జంత్రి గ్రామానికి చెందిన ఇద్దరు గిరిజన మత్స్యకారులు బలిమెల జలాశయంలో చేపల వేటకు వెళ్లారు. వల వేసి కొంతసేపు వేచి చూస్తున్న సమయంలో ఒక్కసారిగా వల బురువెక్కింది. మొదట సాధారణ చేప అయి ఉండొచ్చని భావించిన వారు వలను లాగేందుకు ప్రయత్నించారు. కానీ ఎంత లాగినా వల కదలకపోవడంతో అనుమానం వచ్చి సమీపంలో ఉన్న ఇతర మత్స్యకారులను పిలిచారు. అందరూ కలిసి శ్రమించి వలను గట్టిగా బయటకు లాగగా, ఒక్కసారిగా భారీ ఆకారంలో ఉన్న చేప కనిపించడంతో ఆశ్చర్యానికి గురయ్యారు.
వలలో చిక్కింది ఏ చిన్న చేప కాదు… ఏకంగా 55 కిలోల బరువైన భారీ చేప. సాధారణంగా బలిమెల రిజర్వాయర్‌లో చిన్న చేపల నుంచి గరిష్టంగా 15 నుంచి 20 కిలోల బరువు వరకు చేపలు పడతాయని మత్స్యకారులు చెబుతుంటారు. అప్పుడప్పుడూ పెద్ద తల కలిగిన ‘దోబీ చేప’ వలలో చిక్కినా, ఇంత భారీ చేప రావడం చాలా అరుదని వారు అంటున్నారు. 55 కిలోల బరువున్న ఈ చేపను చూసిన మత్స్యకారులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఆ భారీ చేపను కర్రకు కట్టి భుజాలపై మోస్తూ ఒడ్డుకు తీసుకొచ్చారు.
ఈ భారీ చేప విషయం తెలియగానే పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కొందరు ఆ చేపను చూసేందుకు, మరికొందరు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు. చేపను మోస్తున్న దృశ్యాలను చూసి చాలామంది తమ మొబైళ్లలో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. చివరకు ఆ భారీ చేపకు దాదాపు రూ.15 వేల వరకు ధర వచ్చినట్లు మత్స్యకారులు తెలిపారు. ఈ ఘటనతో బలిమెల జలాశయంలోని చేపల సంపద మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.