అమెరికాకు ఇరాన్ 7 షరతులు.. అప్పటివరకు హార్ముజ్ జలసంధి తెరిచేది లేదు!
Iran Sets 7 Conditions for US: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ ఏడు ప్రధాన షరతులను అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని, వాషింగ్టన్‌తో చర్చలను కూడా ప్రారంభించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తమ డిమాండ్లను అమెరికాకు పంపించామని, అయితే వాషింగ్టన్ నుంచి అధికారిక సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ వెల్లడించారు.
హార్ముజ్ జలసంధి తెరవాలంటే అమెరికాకు ఇరాన్ 7 షరతులు.. చర్చలకు ముందే కీలక డిమాండ్లు..
అమెరికాతో చర్చలకు ఇరాన్ మెలిక.. ముందుగా ఏడు షరతులకు అంగీకరించాల్సిందే..
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరుగుతున్న వేళ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా తమ ఏడు ప్రధాన షరతులను అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని, వాషింగ్టన్‌తో చర్చలను కూడా ప్రారంభించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు తమ డిమాండ్లను అమెరికాకు పంపించామని, అయితే వాషింగ్టన్ నుంచి అధికారిక సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సైనిక చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని గాలిబాఫ్ హెచ్చరించారు. గతంలో మాదిరిగానే మరోసారి అమెరికా ఓటమి చవిచూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్ సీనియర్ భద్రతా అధికారి మొహసేన్ రెజాయీ కూడా అమెరికాతో ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. తమ దేశంపై దాడులు చేసేందుకు అమెరికా, మధ్యప్రాచ్యం వెలుపల ఉన్న సైనిక స్థావరాలను ఉపయోగిస్తే, వాటిని కూడా లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఇరాన్‌కు ఉందని హెచ్చరించారు.
ఇరాన్ ముందుంచిన ఏడు ప్రధాన షరతులు
అమెరికా తమతో చర్చలు ప్రారంభించాలంటే ముందుగా ఏడు అంశాలపై అంగీకారం తెలపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఇందులో ప్రధానంగా ఇరాన్‌పై విధించిన అమెరికా ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడం, విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడం ఉన్నాయి. అలాగే ఇరాన్ నౌకాశ్రయాలపై కొనసాగుతున్న నావికా దిగ్బంధనాన్ని తొలగించాలని, యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతోంది.
ఇవే కాకుండా, ప్రాంతీయంగా కొనసాగుతున్న అన్ని యుద్ధ కార్యకలాపాలకు ముగింపు పలకాలని ఇరాన్ షరతు విధించింది. ముఖ్యంగా లెబనాన్‌తో సహా పశ్చిమాసియాలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు ఆగాలని స్పష్టం చేసింది. ఈ అంశాలపై అమెరికా నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతే తదుపరి చర్యలకు సిద్ధమవుతామని సంకేతాలిచ్చింది.
ఆరు రోజుల తర్వాతే హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం
ఇరాన్ ప్రతిపాదనలో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే అంశానికి కూడా నిర్దిష్ట కాలపరిమితిని సూచించింది. అమెరికా తమ డిమాండ్లను అంగీకరించిన ఆరు రోజుల తర్వాతే ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరుస్తామని తెలిపింది. ఆ తర్వాతి రోజునుంచి తుది ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని ప్రతిపాదించింది. అంటే, ముందుగా అమెరికా తమ షరతులకు అంగీకరించాలి, ఆరు రోజుల తర్వాత హార్ముజ్ జలసంధి తెరవాలి, అనంతరం తుది ఒప్పందంపై చర్చలు జరగాలన్నది ఇరాన్ వైఖరిగా కనిపిస్తోంది.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గాల్లో హార్ముజ్ జలసంధి ఒకటి. ఈ మార్గం విషయంలో ఇరాన్ తీసుకున్న కఠిన వైఖరి అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉండటంతో, ఈ ప్రతిష్టంభనకు దౌత్యపరమైన పరిష్కారం లభిస్తుందా? లేక ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.