ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా విద్య, సంస్కృతి, పరిపాలనకు సంబంధించిన కార్యక్రమాలు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆధునిక సమాజంలో వేదాలు, శాస్త్రాలు, సంస్కృత భాష ప్రాముఖ్యతను తెలియజేసే లక్ష్యంతో ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాలపై చర్చకు ఇది వేదికగా నిలవనుంది.
ఈ సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ హాజరుకానుండగా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభోత్సవానికి రానున్నారు. దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించనున్నారు.
సమ్మేళనంలో భారతీయ విజ్ఞానం, వైభవం, ఖగోళ శాస్త్రం, శాస్త్ర–సాంకేతిక అధ్యయనాలపై ప్రత్యేక ప్రసంగాలు జరగనున్నాయి. ప్రాచీన భారత శాస్త్రీయ విజ్ఞానం ఆధునిక సాంకేతికతకు ఎలా దోహదపడుతుందనే అంశాలపై చర్చలు జరపనున్నారు.
సమ్మేళనం అనంతరం సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యాలయం ప్రారంభంతో జిల్లా స్థాయిలో పోలీసు పరిపాలన మరింత బలోపేతం కానుందని అధికారులు భావిస్తున్నారు. సీఎం పర్యటన తిరుపతి జిల్లాకు ప్రాధాన్యతను మరింత పెంచనుంది.