బంగారం ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ దూసుకుపోతున్నాయి. డిసెంబర్ 26వ తేదీన పసిడి ధరలు ఆల్‌టైమ్ హై స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,40,930గా నమోదైంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,050 పలికింది. వెండి ధర కూడా భారీగా పెరిగి ఒక కేజీ రూ.2,26,270కు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల పెరుగుదలే దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపుతోంది. అమెరికా మార్కెట్‌లో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) బంగారం ధర ఏకంగా 4,500 డాలర్లకు చేరింది. ఇది చరిత్రలోనే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. డాలర్ విలువ బలహీనపడటంతో బంగారంపై పెట్టుబడులు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు దాదాపు 70 శాతం వరకు పెరిగినట్లు అంచనా. గత రెండు వారాలుగా ప్రతిరోజూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తూ భారీగా కొనుగోళ్లు చేయడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారింది. ఇంత వేగంగా బంగారం ధరలు పెరగడం చరిత్రలోనే అరుదైన ఘటనగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
బంగారం ధరల పెరుగుదల నగల కొనుగోలుదారులకు భారంగా మారింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.28 లక్షలు దాటింది. నగల షాపుల్లో మేకింగ్ చార్జీలు, పన్నులు కలుపుకుంటే 10 గ్రాముల బంగారు చైన్ కొనాలంటే దాదాపు రూ.1.40 లక్షల వరకు ఖర్చవుతోంది. దీంతో సాధారణ వినియోగదారులు ఆభరణాల కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు.
ఇక వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రస్తుతం వెండి ధర ఒక కేజీ రూ.2.30 లక్షల సమీపంలో ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండికి డిమాండ్ భారీగా పెరగడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెండి వినియోగం పెరగడంతో ఈ లోహంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది.