వరుస సెలవులు, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సరం వేళ తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. కొండ మొత్తం భక్తులతో నిండిపోయింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూలైన్లు శిలాతోరణం వరకు విస్తరించాయి. అలిపిరి వద్ద వేల సంఖ్యలో వాహనాలు క్యూలో నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. జనవరి తొలి వారం వరకు ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
పెరిగిన భక్తుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు బయటకు వచ్చాయి. నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు కూడా పూర్తిగా నిండిపోయాయి. నారాయణగిరి దాటి శిలాతోరణం వరకు, అక్కడి నుంచి ఆక్టోపస్ భవనం వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్ కొనసాగుతోంది.
ఈ అనూహ్య పరిస్థితుల్లో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ శ్రీవాణి ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీని మూడు రోజుల పాటు రద్దు చేసింది. ఈ నెల 27, 28, 29 తేదీలకు సంబంధించి తిరుమలలోని శ్రీవాణి దర్శన టికెట్ కౌంటర్‌తో పాటు, తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో కూడా ఆఫ్‌లైన్ టికెట్లు జారీ చేయబోమని టీటీడీ స్పష్టం చేసింది.
శ్రీవాణి టికెట్ల రద్దును దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ దర్శన ప్రణాళికలను మార్చుకోవాలని టీటీడీ సూచించింది. అటు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్లు పూర్తవడంతో నడకదారి భక్తుల దివ్య దర్శనం టోకెన్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ఎలాంటి తోపులాటలు జరగకుండా పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ టీటీడీ మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుంచి పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భక్తులు సహనం పాటించాలని, టీటీడీ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరుతున్నారు.