విశాఖపట్నం రైల్వే స్టేషన్ త్వరలోనే పూర్తిగా కొత్త రూపు దాల్చనుంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా సుమారు రూ.500 కోట్ల వ్యయంతో స్టేషన్‌ను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల ఈ పనులకు వేగం పెరగడంతో, విశాఖ ఎంపీ భరత్ రైల్వే అధికారులతో కలిసి స్టేషన్‌లో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన సూచించారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ, రైళ్ల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని ప్రధాన స్టేషన్లను కూడా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో, ఎయిర్‌పోర్ట్ స్థాయి వసతులతో అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఈ పునరాభివృద్ధి ప్రాజెక్టు గురించి మీడియాతో మాట్లాడిన ఎంపీ భరత్, రూ.500 కోట్లతో చేపట్టిన ఈ పనులు గతంలో కొన్ని కారణాల వల్ల జాప్యం అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని సమస్యలు పరిష్కారమయ్యాయని, ఇకపై పనుల్లో ఎలాంటి ఆలస్యం ఉండదన్నారు. వచ్చే 20 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తిచేసి విశాఖ రైల్వే స్టేషన్‌కు పూర్తిగా కొత్త రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
పునరాభివృద్ధి పనుల్లో భాగంగా విశాఖ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ల సంఖ్యను గణనీయంగా పెంచనున్నారు. ప్రస్తుతం ఉన్న 8 ప్లాట్‌ఫామ్‌లకు అదనంగా మరో 6 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించనున్నారు. దీంతో మొత్తం ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 14కు చేరనుంది. అంతేకాకుండా ప్లాట్‌ఫామ్‌ల ఆధునికీకరణ, పశ్చిమ రైల్వే గేట్ పనులు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
విశాఖ రైల్వే స్టేషన్‌ను కేవలం ప్రయాణికుల రాకపోకల కేంద్రంగా కాకుండా, వాణిజ్య మరియు సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. కోర్టు కేసులు, ఇతర అడ్డంకుల వల్ల జరిగిన జాప్యం ఇప్పుడు తొలగిపోవడంతో, నిర్దేశిత కాలంలో పనులు పూర్తిచేసి విశాఖ నగరానికి మరింత గుర్తింపు తీసుకురావాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.