ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతూ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ జ్వరంతో 20 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దాదాపు 2,000 వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా 473 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బాపట్ల, కాకినాడలోనూ మరణాలు చోటు చేసుకోవడంతో అప్రమత్తత పెరిగింది.
స్క్రబ్ టైఫస్ అనేది చిగ్గర్ పురుగు కాటు వల్ల వచ్చే జ్వరం అని వైద్యులు తెలిపారు. దీనిని సకాలంలో గుర్తిస్తే సాధారణ జ్వరంలానే పూర్తిగా నయమవుతుందని వారు భరోసా ఇస్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువమందికి ఇప్పటికే ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉండటంతో సమస్య తీవ్రత పెరిగిందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.
ఈ జ్వరాన్ని ముందుగానే గుర్తించకపోతే, శరీరంలోని కాలేయం, ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి అవయవాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్‌సీల్లో స్క్రబ్ టైఫస్ పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచారు. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేయించుకుని చికిత్స ప్రారంభిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు.
చిగ్గర్ పురుగు కుట్టిన చోట నల్లటి పొక్కు లేదా మచ్చ కనిపించడం ఈ జ్వరానికి ప్రధాన లక్షణం. సాధారణంగా 7 నుంచి 20 రోజుల్లో జ్వరం, చలిజ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఒకవేళ మచ్చ కనిపించకపోయినా, లక్షణాలు ఉంటే ఎలైసా (ELISA) పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
ఈ చిగ్గర్ పురుగులు సాధారణంగా పొదలు, పచ్చిక బయళ్లు, పొల్లాలు, తేమ ఎక్కువగా ఉండే శుభ్రతలేని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలం నుంచి శీతాకాలం ముగిసేవరకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. రోగ నిరోధక శక్తి తక్కువవారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని, అనుమానం వచ్చిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు.