Hyderabad: హైదరాబాద్‌లో భారీ కల్తీ మసాలా దందా బట్టబయలు.. 25 టన్నులకు పైగా కల్తీ సుగంధ ద్రవ్యాలు స్వాధీనం!
Hyderabad: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న భారీ కల్తీ మసాలా దందాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 25,300 కిలోలకుపైగా కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
వాము, జీలకర్ర, ఆవాల్లో కల్తీ.. హైదరాబాద్‌లో H-FAST భారీ దాడులు..
తెలంగాణ, ఏపీకి సరఫరా చేయనున్న కల్తీ మసాలాలు స్వాధీనం.. హైదరాబాద్ పోలీసుల సంచలన ఆపరేషన్..
హైదరాబాద్: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న భారీ కల్తీ మసాలా దందాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్ (H-FAST), జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 25,300 కిలోలకుపైగా కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కల్తీ కోసం ఉపయోగిస్తున్న 89,150 కిలోల ముడి పదార్థాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల వివరాల ప్రకారం, ఈ కల్తీ మసాలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విక్రయించేందుకు సిద్ధం చేశారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 7,920 కిలోల వాము (అజ్వైన్), 6,700 కిలోల జీలకర్ర, 4,960 కిలోల ఆవాలు, 2,350 కిలోల జీలకర్ర పొడి, 2,280 కిలోల షాజీరా, 550 కిలోల లవంగాలు, 540 కిలోల సోంపు ఉన్నాయి.
కల్తీ ఎలా చేసేవారు?
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సీ. సజ్జనార్ తెలిపిన వివరాల ప్రకారం, నాణ్యత లేని ఆవాలను వస్త్రాలకు ఉపయోగించే రంగులు, టాల్కం పౌడర్, నూనె కలిపి మెరుపు, బరువు, పరిమాణం పెరిగినట్లు కనిపించేలా తయారు చేస్తున్నారు. అలాగే లవంగాలు, షాజీరాపై సింథటిక్ రంగులు పూసి వాటిని నాణ్యమైన ఉత్పత్తుల్లా విక్రయిస్తున్నారు.
వాము, షాజీరా సహా మరికొన్ని సుగంధ ద్రవ్యాలకు పారిశ్రామిక రంగులు (Industrial Dyes) ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలపై "విషపూరితం – తినడానికి కాదు" అనే హెచ్చరికలు ఉన్నప్పటికీ వాటినే ఆహార పదార్థాల్లో వినియోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
13 ప్రాంతాల్లో తనిఖీలు.. ముగ్గురు అరెస్ట్
విశ్వసనీయ సమాచారం ఆధారంగా హెచ్-ఫాస్ట్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ బృందాలు నగరంలోని 13 వ్యాపార సంస్థలు, తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆహార భద్రతా ప్రమాణాల చట్టం–2006 నిబంధనలను ఉల్లంఘించడం, తప్పుదారి పట్టించే లేబుళ్లు (Misbranding) వంటి ఉల్లంఘనలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసులో రాహుల్ భాటి (కాటేదాన్), విశాల్ పవార్, దులీచంద్ కచావర్ (బేగంబజార్)లను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై మూడు కేసులు నమోదు చేశారు.
ఇండోర్‌లో నేర్చుకున్న కల్తీ పద్ధతులు
విచారణలో నిందితులు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రాంతంలో ఈ కల్తీ పద్ధతులను నేర్చుకున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తనిఖీల సందర్భంగా కల్తీ మసాలాలు ఎలా తయారు చేస్తున్నారో చూపించే వీడియోలను కూడా అధికారులు విడుదల చేశారు.
నీటిలో పరీక్షతో బయటపడిన నిజం
కల్తీ, స్వచ్ఛమైన లవంగాలు, సోంపును వేర్వేరు గ్లాసుల్లో నీటిలో వేసి చూపించగా, కల్తీ చేసిన మసాలాలు ఉన్న గ్లాసుల్లో నీటి రంగు వెంటనే మారిపోయింది. మరోవైపు కొన్ని ఆవాలకు ఉపయోగించిన పారిశ్రామిక రంగు నీటిలో కలిపినా పోకపోవడం కల్తీ తీవ్రతను స్పష్టం చేసింది.
ప్రజలకు హెచ్చరిక.. H-FAST హెల్ప్‌లైన్ అందుబాటులో
స్వాధీనం చేసుకున్న మసాలాలు, కల్తీ రసాయనాలను ప్రయోగశాలకు పంపించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు కనిపిస్తే ప్రజలు H-FAST టోల్‌ఫ్రీ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలని, అలాగే @HFastHCP ఎక్స్ (X) ఖాతా ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు.
ఆహార పదార్థాల్లో కల్తీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, వినియోగదారులు విశ్వసనీయ దుకాణాల నుంచే సుగంధ ద్రవ్యాలు కొనుగోలు చేయాలని, అసాధారణ రంగు లేదా వాసన ఉన్న ఉత్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Be the first to react