నాన్ వెజ్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టపడుతూ ఉంటారు ఒకరికి చికెన్ ఇష్టం ఇంకొకరికి మటన్ ఇష్టం వారొకరికి చాపలు ఇష్టం ఇలా ఒక్కొక్కరికి విభిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. పక్కింట్లో తింటే అది మన ఇంట్లో ఎందుకు రాదా అనే భావన మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. కొంతమంది చాపల కూర వండుతూ ఉంటే ఆ వాసనకే ఆకలి పెరిగిపోతుంది.
నిజానికి చేపల కర్రీ రుచి పెరగాలంటే కొన్ని చిన్న విషయాలు చాలా ముఖ్యం. అవే కర్రీని సాధారణంగా కాకుండా ఘుమఘుమలాడే స్థాయికి తీసుకెళ్తాయి. చేపల కర్రీలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది మసాలా వేయించే విధానం. చాలా మంది తొందరపడి కారం, చింతపండు అన్నీ ఒకేసారి వేసేస్తారు. అలా చేస్తే పులుసులో లోతైన రుచి రాదు. ముందుగా ఉల్లిపాయలను బాగా వేయించడం చాలా అవసరం. ఉల్లిపాయలు పూర్తిగా మగ్గి, నూనె వదిలే వరకు ఓపికగా వేయిస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఉల్లిపాయ పేస్ట్ కొద్దిగా ముదురు రంగుకు మారితే అప్పుడే మసాలా వేసేందుకు సిద్ధమవాలి.
చేప ముక్కలను ముందే ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిసేపు మెరినేట్ చేయడం వల్ల ముక్కల్లోకి రుచి బాగా చేరుతుంది. ఈ దశను దాటవేస్తే కర్రీపై రుచి ఉన్నా, చేప ముక్కలు చప్పగా ఉంటాయి. మెరినేషన్ తర్వాత ముక్కలను లైట్‌గా ఫ్రై చేయడం మరో ముఖ్యమైన స్టెప్. ఇలా చేయడం వల్ల ముక్కలు పులుసులో వేసినప్పుడు చెదిరిపోవు. అంతేకాదు, ఫ్రై చేసిన ముక్కల వల్ల కర్రీకి ప్రత్యేకమైన ఫ్లేవర్ కూడా వస్తుంది.
మసాలా వేసే టైమింగ్ కూడా చాలా కీలకం. ఉల్లిపాయలు వేయించిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వంటి మసాలాలను నూనెలో బాగా వేయించాలి. మసాలా వాసన పోయే వరకు ఓపికగా వేయిస్తేనే అసలు రుచి బయటకు వస్తుంది. ఈ దశలోనే కాస్త నూనె ఎక్కువగా ఉంటే కర్రీ మరింత రిచ్‌గా తయారవుతుంది.
చింతపండు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మసాలా బాగా మగ్గిన తర్వాతే చింతపండు గుజ్జు వేయాలి. ముందే వేసేస్తే పులుసు పుల్లగా మాత్రమే ఉండి మసాలా రుచి తగ్గిపోతుంది. చింతపండు వేసిన తర్వాత కొద్దిగా ఉడికించి, గ్రేవీ ఒకటిగా కలిసేలా చేయాలి. జీడిపప్పు పేస్ట్ వేసితే కర్రీకి మందం రావడమే కాకుండా, హోటల్ స్టైల్ టేస్ట్ కూడా వస్తుంది.
చేపల కర్రీని ఎక్కువ మంటపై కాకుండా నెమ్మదిగా మగ్గించడమే అసలు రహసం. లో ఫ్లేమ్‌లో ఉడికితే మసాలా మొత్తం పులుసులోకి చేరి, చేప ముక్కలు రుచిని పీల్చుకుంటాయి. చివరగా కసూరి మేతి, కొత్తిమీర వేసితే కర్రీకి అదిరిపోయే అరొమా వస్తుంది. మూతపెట్టి కొద్దిసేపు అలాగే ఉంచితే మరుసటి రోజు తినేటప్పుడు ఆ రుచి ఇంకా పెరుగుతుంది. ఇలా కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే, ఇంట్లో చేసే చేపల కర్రీ కూడా రెస్టారెంట్ స్థాయి రుచిని ఇస్తుంది. కాస్త ఓపిక, సరైన టైమింగ్, మసాలా వేయించే విధానమే మంచి చేపల పులుసుకు అసలు సీక్రెట్ అని చెప్పొచ్చు.