తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు నెలల్లోగా అన్ని జల సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.
ఈ కమిటీకి కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అధ్యక్షత వహిస్తారు. మొత్తం 12 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు, కేంద్ర ప్రభుత్వం నుంచి నలుగురు ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అనుమతితో ఇటీవల విడుదలయ్యాయి.
గతేడాది జులై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పలు జల సమస్యలపై చర్చ జరిగింది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
కృష్ణా, గోదావరి నదుల జల పంపకాలు, శ్రీశైలం ప్రాజెక్టు భద్రతా చర్యలు, ప్రాజెక్టుల నిర్వహణ, బనకచర్ల అంశం వంటి మొత్తం 10 కీలక జల సమస్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. సమగ్ర సాంకేతిక అధ్యయనం చేసి, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను సూచించాలని కేంద్రం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఇంజినీర్ ఇన్ చీఫ్, అంతర్రాష్ట్ర జల విభాగం చీఫ్ ఇంజినీర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, సలహాదారు, ఇంజినీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉంటారు. కేంద్రం నుంచి కృష్ణా బోర్డు ఛైర్మన్, గోదావరి బోర్డు ఛైర్మన్, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ కమిటీలో ఉన్నారు.
ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రాలు వేరైనా, తెలుగుజాతి అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగాలని గత సమావేశంలో సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కమిటీతో జల సమస్యలకు స్పష్టత రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.