కుంకుమ పువ్వు పేరు వినగానే మనకు వెంటనే కశ్మీర్ మంచు కొండలు గుర్తుకు వస్తాయి. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే ఈ పంట పండుతుందని చాలా మంది భావిస్తారు. అలాంటి ఆలోచనలకు సవాల్ విసురుతూ, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ఒడిశాలో ఒక మహిళ ఇంట్లోనే కంటైనర్లలో కుంకుమ పువ్వులు పండిస్తూ అందరికీ ప్రేరణగా నిలుస్తున్నారు. సంకల్పం ఉంటే అసాధ్యమనే మాట ఉండదని ఆమె తన కృషితో నిరూపిస్తున్నారు.
ఒడిశాలోని ఝార్సుగూడ పట్టణానికి చెందిన సుజాత అగర్వాల్ సాధారణ గృహిణిగానే జీవితం ప్రారంభించారు. కరోనా సమయంలో ఇంట్లోనే ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఆమెకు వచ్చింది. అప్పటివరకు హైడ్రోపోనిక్ సాగు, మైక్రో గ్రీన్స్ వంటి పద్ధతులపై ఆసక్తి చూపిన సుజాత, మార్కెట్‌లో కుంకుమ పువ్వులకు ఉన్న డిమాండ్‌ను గమనించి ఈ అరుదైన పంట వైపు అడుగులు వేసింది. మొదట ఈ ఆలోచన చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇక్కడ అది పండదు అనే మాటలు ఎక్కువగా వినిపించాయి. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు.
తన ఇంట్లోని సుమారు 100 చదరపు అడుగుల స్థలాన్ని చిన్నపాటి సాగు కేంద్రంగా మార్చారు. ప్రత్యేక కంటైనర్లను ఏర్పాటు చేసి, ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ఏసీ వ్యవస్థను అమర్చారు. నేల రకం, విత్తనాల ఎంపిక, నీటి మోతాదు, కాంతి వంటి అంశాలపై ఇంటర్నెట్ ద్వారా అధ్యయనం చేశారు. భర్త, కుమార్తెల సహకారంతో 2022లో కుంకుమ పువ్వుల సాగును ప్రారంభించారు. ఈ ఏర్పాట్ల కోసం ఆమె దాదాపు 8 నుంచి 9 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు చెబుతున్నారు.
మొదటి పువ్వు వికసించిన రోజు తన జీవితంలో మరిచిపోలేని క్షణమని సుజాత తెలిపారు. ఇప్పుడామె ఐదు రకాల నేలల్లో కుంకుమ పువ్వులను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. సంవత్సరానికి రెండు నుంచి మూడు సార్లు పంట తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది 750 గ్రాముల కుంకుమ కేసరి పంట చేతికి రాగా, దాని మార్కెట్ విలువ దాదాపు 7.5 లక్షల రూపాయల వరకు వచ్చింది. ఈ ఏడాది లక్ష్యంగా మూడు పంటలతో రెండు కిలోల ఉత్పత్తిని సాధించి, సుమారు 20 లక్షల రూపాయల ఆదాయం పొందాలని ఆమె ఆశిస్తున్నారు.
సుజాత పండించిన కుంకుమ పువ్వులు దేశంలోనే కాదు, విదేశాల్లోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఆన్లైన్ వేదికల ద్వారా యూకే, దుబాయ్ వంటి దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. కేసరితో పాటు కాండాలు, పూరేకులను ఆయుర్వేద, బ్యూటీ ఉత్పత్తుల తయారీ సంస్థలకు సరఫరా చేస్తున్నారు. ‘బ్లూమ్ ఇన్ హైడ్రా’ అనే పేరుతో ఆమె తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సాగు ద్వారా సుజాత తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా, మరికొందరికి ఉపాధి అవకాశాలు కూడా అందిస్తున్నారు. ఆమె వద్ద పనిచేస్తున్న కార్మికుల కుటుంబాల పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఒక ఇంట్లో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు ఎంతోమందికి ఆశాకిరణంగా మారింది. కష్టపడి నేర్చుకుంటే, ధైర్యంగా ప్రయత్నిస్తే, కొత్త దారులు ఎప్పుడూ తెరుచుకుంటాయని సుజాత అగర్వాల్ కథ మనకు స్పష్టంగా చెబుతోంది.