25 చెట్లతో సమానమైన ఆల్గే ట్రీ! కాలుష్యానికి చెక్! ఏపీలో మొదటిసారిగా గుంటూరులో!
Guntur Algae Tree Technology: కాలుష్య సమస్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని గాంధీ పార్క్‌లో ‘ఆల్గే ట్రీ’ పేరుతో ప్రత్యేక ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ సాంకేతికతను గుంటూరులో ప్రవేశపెట్టడం విశేషం. అసలు ఈ ఆల్గే ట్రీ ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకతలు ఏమిటి? ఎంత ఖర్చవుతుంది? తెలుసుకుందాం.
- గుంటూరులోని గాంధీ పార్క్‌లో రాష్ట్రంలోనే తొలి ఆల్గే ట్రీని ఏర్పాటు చేశారు.
- ఈ ఆల్గే ట్రీ సుమారు 25 చెట్లతో సమానమైన ప్రయోజనాన్ని అందిస్తుంది.
- ఒక్కో ఆల్గే ట్రీ ఏర్పాటుకు సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుంది.
Guntur Algae Tree Technology: కాలుష్య సమస్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు గుంటూరు నగరపాలక సంస్థ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. నగరంలోని గాంధీ పార్క్‌లో ‘ఆల్గే ట్రీ’ పేరుతో ప్రత్యేక ఆక్సిజన్ ఉత్పత్తి పరికరాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ సాంకేతికతను గుంటూరులో ప్రవేశపెట్టడం విశేషం. అసలు ఈ ఆల్గే ట్రీ ఎలా పనిచేస్తుంది? దీని ప్రత్యేకతలు ఏమిటి? ఎంత ఖర్చవుతుంది? తెలుసుకుందాం.
సూక్ష్మ శైవలాలతో ఆక్సిజన్ ఉత్పత్తి
సాధారణ చెట్లు కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇదే విధానాన్ని ఆధారంగా చేసుకుని ఆల్గే ట్రీని రూపొందించారు. ఇందులో సూక్ష్మ శైవలాలను (మైక్రో ఆల్గే) ఉపయోగిస్తారు. ఇవి కిరణజన్య సంయోగక్రియ ద్వారా గాలిలోని కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. తద్వారా పరిసర ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయి.
సాధారణ చెట్ల కంటే 10 నుంచి 40 రెట్లు వేగంగా..
ఆల్గే ట్రీలో ఉపయోగించే సూక్ష్మ శైవలాలు సాధారణ చెట్లతో పోలిస్తే 10 నుంచి 40 రెట్లు వేగంగా కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తాయని అధికారులు చెబుతున్నారు. అందువల్ల తక్కువ స్థలంలోనే అధికంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఒక ఆల్గే ట్రీ సుమారు 25 చెట్లతో సమానమైన ప్రయోజనాన్ని అందిస్తుందని అధికారులు వెల్లడించారు.
ఒక్క యంత్రానికి రూ.5 లక్షల ఖర్చు
గుంటూరులోని గాంధీ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆల్గే ట్రీకి సుమారు రూ.5 లక్షలు ఖర్చయింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధుల ద్వారా లలిత హాస్పిటల్స్ ఈ పరికరం ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఈ సాంకేతికతను ఇప్పటికే వినియోగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని వివేకానంద పార్క్‌లో దేశంలో తొలి ఆల్గే ట్రీని ఏర్పాటు చేశారు.
ఎక్కడెక్కడ ఏర్పాటు చేయవచ్చు?
నగరాల్లో చెట్లు పెంచేందుకు తగినంత స్థలం లేని ప్రాంతాల్లో ఆల్గే ట్రీలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, దుమ్ము, ధూళి అధికంగా ఉండే ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయవచ్చు. ఇలాంటి ప్రాంతాల్లో సాధారణ మొక్కలు నాటడం కష్టమైనప్పటికీ ఆల్గే ట్రీని ఏర్పాటు చేయడం సులభం.
చెట్లకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు!
ఆల్గే ట్రీలను ఏర్పాటు చేసినంత మాత్రాన చెట్ల పెంపకాన్ని పక్కన పెట్టకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే చెట్లు ఆక్సిజన్ అందించడమే కాకుండా నీడను ఇస్తాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు నేల కోతను నివారించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ఆల్గే ట్రీ మాత్రం ప్రధానంగా గాలిలోని కాలుష్య కారకాలను తగ్గించడం, ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం వంటి ప్రయోజనాలకే పరిమితం.
నగరవ్యాప్తంగా విస్తరించే యోచన
గుంటూరు నగరంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు. కొత్త సాంకేతికతను కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తొలుత రెండు, మూడు నెలల పాటు ఈ పరికరం పనితీరును నిశితంగా పరిశీలించనున్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉంటే నగరంలోని ఇతర ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లోనూ ఆల్గే ట్రీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
మొత్తంగా, సంప్రదాయ పద్ధతుల్లో చెట్లను పెంచేందుకు అవకాశం లేని ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు ఆల్గే ట్రీ సాంకేతికత ఒక అదనపు మార్గంగా నిలవనుంది.
Be the first to react