Schools: విలువలతో కూడిన విద్యే లక్ష్యం.. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నాం.. మంత్రి కొల్లు రవీంద్ర హామీ!
Schools: విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్స్ విద్యా రంగంలో ఒక కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతాం: కొల్లు రవీంద్ర..
పదో తరగతి ఫలితాల్లో కృష్ణా జిల్లాను టాప్-3లో నిలబెడతాం..
మచిలీపట్నం: విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ దిశగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్స్ విద్యా రంగంలో ఒక కొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయని పేర్కొన్నారు.
మచిలీపట్నం సమీపంలోని తాళ్లపాలెం జెడ్పీ హైస్కూల్‌లో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన (ఎగ్జిబిషన్)ను పరిశీలించారు. పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. తల్లిదండ్రులకు విద్యార్థులతో పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించగా, అనంతరం వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యార్థుల చదువు, ఆసక్తులు, ప్రతిభ, పాఠశాలల పరిస్థితిని నేరుగా తెలుసుకునేందుకే మెగా పేరెంట్–టీచర్ సమావేశాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
గత ఏడాది రాష్ట్రంలోని 46 వేల పాఠశాలల్లో ఈ కార్యక్రమం నిర్వహించగా, ఈసారి 62 వేల పాఠశాలల్లో నిర్వహించడం విద్యా రంగంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. పాఠశాలల అభివృద్ధి కోసం స్కూల్ డెవలప్‌మెంట్ కమిటీలు ఏర్పాటు చేశామని, పూర్వ విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటుండటం ఆనందకరమని అన్నారు. గత ఏడాది జరిగిన సమావేశాల అనంతరం దాదాపు 22 వేల ప్రభుత్వ పాఠశాలలను పూర్వ విద్యార్థులు దత్తత తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో కృష్ణా జిల్లా 85 శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమని మంత్రి అన్నారు. అయితే వచ్చే ఏడాది రాష్ట్రంలో మొదటి మూడు స్థానాల్లో కృష్ణా జిల్లాను నిలబెట్టే బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. తాళ్లపాలెం పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన 70 మంది విద్యార్థుల్లో 58 మంది బాలికలు ఉండటం గర్వకారణమని కొనియాడారు. బాలికల విద్యకు కుటుంబాలు ఇస్తున్న ప్రాధాన్యత సమాజ అభివృద్ధికి శుభపరిణామమని అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల్లో కుటుంబ విలువలు, దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి వివరించారు. తల్లిదండ్రుల కష్టాన్ని పిల్లలు గుర్తించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విద్యతో పాటు నైతిక విలువలు బోధించేందుకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను కూడా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం రాజీ పడడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో విద్యా రంగానికి రూ.32 వేల కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఎన్నికల హామీ మేరకు 'తల్లికి వందనం' పథకం ద్వారా 67 లక్షల మంది విద్యార్థులకు రూ.10,500 కోట్ల ఆర్థిక సాయం అందించామని తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్థికి ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.
అలాగే హామీ ఇచ్చినట్లుగానే 16,300 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, ఉపాధ్యాయులకు సింగపూర్‌లో ఆధునిక శిక్షణ అందిస్తున్నామని వెల్లడించారు. త్వరలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని మంత్రి ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేశారని, ఉపాధ్యాయులను ఇతర విధుల్లో ఉపయోగించి అవమానించారని విమర్శించారు. ప్రస్తుతం మాత్రం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే, ఉపాధ్యాయ నియామకాల విషయంలో కూడా ప్రతిపక్షం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. అయినప్పటికీ రాష్ట్ర అభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags
Be the first to react