Education: షైనింగ్ స్టార్స్–2026తో ప్రతిభకు గుర్తింపు.. విద్యా సంస్కరణలకు ఇదే నిదర్శనం.. మంత్రి అనగాని సత్యప్రసాద్!
Education: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులకు "షైనింగ్ స్టార్స్–2026" కార్యక్రమం ప్రత్యక్ష నిదర్శనమని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
258 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పురస్కారాలు..
విద్యార్థుల ప్రతిభకు ఘన సత్కారం.. తిరుపతిలో ‘షైనింగ్ స్టార్స్-2026’..
తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులకు "షైనింగ్ స్టార్స్–2026" కార్యక్రమం ప్రత్యక్ష నిదర్శనమని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్ తరాలకు బలమైన పునాది వేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన "షైనింగ్ స్టార్స్–2026" ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, అరవ శ్రీధర్, నెలవల విజయశ్రీ, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్, ఆర్‌ఐఓ గోపాల్ రెడ్డి, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్ర విద్యా వ్యవస్థ గత ప్రభుత్వ హయాంలో వెనుకబడిందని, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యా రంగంలో విస్తృత సంస్కరణలు అమలు అవుతున్నాయని తెలిపారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీయడం, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు, నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజన పథకం పునరుద్ధరణ, 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాలు విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని వివరించారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం పేరెంట్–టీచర్ సమావేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. ఈ నెల 24న నిర్వహించే సమావేశాలకు ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను ప్రభుత్వం అందిస్తోందన్నారు.
తిరుపతి జిల్లాను ఆధ్యాత్మిక, క్రీడా, అతిథ్య, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని, తిరుపతిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు.
గతంలో కొద్దిమంది విద్యార్థులకు మాత్రమే ప్రతిభా పురస్కారాలు అందేవని, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 258 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఒకే వేదికపై సత్కరించడం విద్యా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని మంత్రి అన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు "షైనింగ్ స్టార్స్–2026" పురస్కారాలు, చెక్కులు, జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేసి ఘనంగా సన్మానించారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడమే సమాజ అభివృద్ధికి నిజమైన పునాదిగా నిలుస్తుందని అన్నారు. పిల్లల విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రెండు చక్రాల్లాంటి వారని, వారి సమిష్టి కృషితోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరగలరని చెప్పారు.
ప్రతి విద్యార్థిలో ప్రత్యేక ప్రతిభ ఉంటుందని, ఇతరులతో పోల్చడం ద్వారా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మార్కులే జీవిత విజయానికి కొలమానం కాదని, మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నైపుణ్యాలు కూడా సమానంగా అవసరమని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభను గుర్తించి విద్యార్థులను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందని విద్యార్థులు, తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. "షైనింగ్ స్టార్స్–2026" కార్యక్రమం రాష్ట్రంలో అమలవుతున్న విద్యా సంస్కరణలకు ప్రతీకగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు.
Tags
Be the first to react
