Minister Savitha: రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు.. విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం!

Minister Savitha: రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను మరింత విస్తరిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

Minister Savitha
Minister Savitha

10 కొత్త గురుకులాలు ప్రారంభం.. మరో ఏడాది మరిన్ని విద్యాసంస్థలు ఏర్పాటు..

నసన్నకోట బీసీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి సవిత..

శ్రీసత్యసాయి జిల్లా: రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను మరింత విస్తరిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పది కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే (ఎంజేపీ) బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం నసన్నకోటలో బీసీ బాలికల గురుకుల పాఠశాలను జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసిన సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థల కంటే ఎంజేపీ గురుకులాల్లో సీట్లు పొందేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి సవిత తెలిపారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భద్రత, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

గురుకులాల్లో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, తరగతి గదులు, వసతి గృహాల్లో దోమలు రాకుండా దోమతెరలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన ఆహారం అందించేందుకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని చెప్పారు.

అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో గురుకుల విద్యకు పునాది వేశారని మంత్రి గుర్తు చేశారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల విస్తరణకు కృషి చేస్తున్నారని చెప్పారు.

2014లో రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 32 బీసీ గురుకులాలే ఉండగా, 2014-2019 మధ్య 75 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో పది కొత్త గురుకులాలు ప్రారంభించామని, వాటిలో ఐదు రాయలసీమలో, మరో ఐదు ఉత్తరాంధ్రలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అదే సమయంలో ఆరు బీసీ బాలికల గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామని, నసన్నకోట గురుకులం కూడా వాటిలో ఒకటేనని వెల్లడించారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే విద్యా సంవత్సరంలో డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త గురుకులాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. 'తల్లికి వందనం' పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున అందజేస్తున్నామని చెప్పారు.

ఈ పథకం ద్వారా 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా రూ.10,120.78 కోట్లను 42,70,802 మంది తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే విద్యార్థులకు విద్యా మిత్ర కిట్లు పంపిణీ చేశామని, ఎంజేపీ గురుకులాల్లో క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ కిట్లను కూడా అందించామని తెలిపారు.

నసన్నకోట బీసీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటుకు దివంగత నాయకుడు పరిటాల రవి తన సొంతంగా పది ఎకరాల భూమిని అందజేయడం గొప్ప సేవ అని మంత్రి కొనియాడారు. ఆయన సేవా భావం ఎంతో మందికి ఆదర్శమని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే పరిటాల సునీత తన సొంత నిధులతో గురుకుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత ప్రతిపక్ష వైసీపీపై కూడా విమర్శలు చేశారు. తమ ఇళ్ల ముందు రోడ్లు కూడా వేయించుకోలేని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రెండేళ్లలో కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.

నసన్నకోట బీసీ బాలికల గురుకులాన్ని జూనియర్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి సవితకు ఎమ్మెల్యే పరిటాల సునీత కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags

Be the first to react

Latest