నగర జీవనంలో రోజువారీ ప్రయాణం ఒక పెద్ద అవసరంగా మారింది. ఉద్యోగాలకు వెళ్లే వారు, విద్యార్థులు, వ్యాపారులు… ఇలా వేలాది మంది ప్రతిరోజూ ఒక చోటు నుంచి మరొక చోటుకి చేరుకోవడానికి ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి ఆన్‌లైన్ యాప్‌లపై ఆధారపడుతున్నారు. బైక్, ఆటో, క్యాబ్ సేవలు సులభంగా లభిస్తున్నప్పటికీ, ఇటీవల ఈ యాప్‌ల ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా పీక్ అవర్స్, వర్షాకాలం, పండుగలు వంటి సమయాల్లో సర్జ్ ప్రైసింగ్ పేరుతో వినియోగదారులపై భారీ భారం పడుతోంది. దీంతో సామాన్య ప్రయాణికుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు.
ఇక మరోవైపు వాహన యజమానులు, డ్రైవర్ల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. వినియోగదారుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ, అందులో డ్రైవర్లకు అందే వాటా చాలా తక్కువగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. కమిషన్ పేరుతో యాప్ కంపెనీలు పెద్ద మొత్తాన్ని తీసుకుంటుండటంతో, ఇంధన ఖర్చులు, వాహన నిర్వహణ ఖర్చులు పోను డ్రైవర్ల చేతిలో మిగిలేది స్వల్పమే. దీంతో అటు ప్రయాణికులు, ఇటు డ్రైవర్లు… ఇద్దరికీ నష్టం జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు చౌకగా, పారదర్శకంగా ట్యాక్సీ సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ ట్యాక్సీ’ అనే కొత్త యాప్‌ను రూపొందించింది. ప్రైవేట్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన ఈ యాప్‌ను నూతన సంవత్సర కానుకగా జనవరి 1 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. మొదట ఢిల్లీలో ఈ సేవలను ప్రారంభించి, అనంతరం దశలవారీగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు. ఈ యాప్ ద్వారా ఆటోలు, కార్లు, బైక్ ట్యాక్సీలను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు.
భారత్ ట్యాక్సీ యాప్ ప్రత్యేకత ఏమిటంటే… వినియోగదారుల నుంచి వసూలు చేసే మొత్తం ఛార్జ్‌లో డ్రైవర్లకు 80 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని అందించేలా రూపొందించారు. దీంతో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే సర్జ్ ప్రైసింగ్ లేకుండా న్యాయమైన ధరలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఢిల్లీలో ఈ యాప్‌కు మంచి స్పందన లభిస్తోంది. సుమారు 56 వేల మంది డ్రైవర్లు నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఈ యాప్ రాకతో ఓలా, ఉబర్ వంటి సంస్థలపై ధరల నియంత్రణ ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే, భారత్ ట్యాక్సీ యాప్ ప్రజలకు ప్రయాణ భారం తగ్గించడమే కాకుండా, డ్రైవర్లకు ఆర్థిక భద్రత కల్పించే కీలక అడుగుగా నిలవనుంది.