ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేస్తూ హజ్ యాత్రికులకు కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాయం ఇతర నగరాల నుంచి కాకుండా, ప్రత్యేకంగా విజయవాడ నుంచి ప్రయాణించే వారికి మాత్రమే వర్తించనుంది.
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పోలిస్తే విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే విమాన టికెట్ ధర ఎక్కువగా ఉండటంతో యాత్రికులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ఈ భారం యాత్రికులపై కాకుండా ప్రభుత్వమే భరించాలని భావించి ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే రాజధాని అమరావతిని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యంతో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నిర్ణయంతో విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు పెద్ద ఊరట లభించనుంది. టికెట్ ధరలో ఉండే వ్యత్యాసం వల్ల కలిగే అదనపు ఖర్చును ప్రభుత్వం భరించడం ద్వారా యాత్రికుల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించనుంది. ఈ పథకం అమలుకు అవసరమైన చర్యలను మైనారిటీ సంక్షేమ శాఖ, రాష్ట్ర హజ్ కమిటీ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదిలా ఉండగా, ఏపీ వక్ఫ్‌బోర్డు గత ఏడాది కాలంలో చేసిన పనితీరు దేశానికే ఆదర్శంగా నిలిచిందని వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. విజయవాడలో జరిగిన 9వ బోర్డు సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో పూర్తి పారదర్శకత, చట్టబద్ధత, బాధ్యతాయుత పరిపాలనను అమలు చేశామని చెప్పారు.
కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలువైన వక్ఫ్ భూములకు సంబంధించిన 89 అక్రమ అమ్మకాల పత్రాలను రద్దు చేయించామని, వాటి విలువ సుమారు రూ.650 కోట్లు ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 953 నోటీసులు జారీ చేసి 820 ఎకరాల వక్ఫ్ భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే ఈ-టెండరింగ్ విధానం ద్వారా వక్ఫ్‌బోర్డు ఆదాయం పెరిగిందని, గత ఏడాదితో పోలిస్తే రూ.3.50 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇమామ్‌లు, మౌజాన్లకు 18 నెలలుగా పెండింగ్‌లో ఉన్న గౌరవ వేతనాల కోసం రూ.1.35 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.