ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు మరింత సులభమైన సేవలు అందించే దిశగా మరో కీలక అడుగు వేసింది. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్లను వాట్సాప్ ద్వారా నేరుగా బుక్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రయాణికులు వాట్సాప్‌లో 9552300009 (మన మిత్ర) నెంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపితే చాలు, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సేవలు వెంటనే తెరపైకి వస్తాయి. ప్రతిరోజూ లక్షలాది మంది ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న నేపథ్యంలో, ఈ డిజిటల్ సదుపాయం ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కల్పించనుంది.
ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీ అడ్వాన్స్ రిజర్వేషన్ టికెట్ల కోసం రెడ్‌బస్, అభిబస్, పేటీఎం వంటి ఫ్రాంచైజీలు, అలాగే ATB (Any Time Booking) ఏజెంట్లపై ప్రయాణికులు ఆధారపడేవారు. అయితే, టెక్నాలజీ వినియోగంలో ఎప్పుడూ ముందుండే ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చొరవతో ఇప్పుడు అధికారికంగా వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్ ‘మన మిత్ర’ ద్వారా ఈ సేవను ప్రారంభించింది. దీంతో మధ్యవర్తుల అవసరం లేకుండా, నేరుగా ప్రభుత్వ సేవలను ప్రయాణికులు పొందే అవకాశం కలిగింది. ఇది డిజిటల్ పాలన దిశగా తీసుకున్న మరో ముందడుగుగా అధికారులు పేర్కొంటున్నారు.
అయితే, వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ, దీనిపై ప్రయాణికుల్లో సరైన అవగాహన లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా టికెట్ల అమ్మకాలను పెంచడంతో పాటు, ఈ సేవను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అప్పలరాజు, తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో వాట్సాప్ టికెట్ బుకింగ్ విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్ని జిల్లాల ప్రజా రవాణా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సేవను ప్రతి ప్రయాణికుడికి చేరవేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
దీనిలో భాగంగా బస్ స్టేషన్లు, రిజర్వేషన్ కౌంటర్లు, ఎంక్వైరీ కౌంటర్లు, అలాగే బస్ స్టేషన్లలోని ఇతర ముఖ్య ప్రదేశాల్లో బ్యానర్లను ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల లోపల స్టిక్కర్లను అంటిస్తూ, 9552300009 (మన మిత్ర) నెంబర్‌కు వాట్సాప్ ద్వారా ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుక్ చేసుకోవచ్చని విస్తృత ప్రచారం చేస్తున్నారు. టికెట్ బుకింగ్ ప్రక్రియ కూడా చాలా సులభమని అధికారులు చెబుతున్నారు. ముందుగా నెంబర్ సేవ్ చేసి ‘హాయ్’ అని పంపితే, టికెట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకుని ప్రయాణ వివరాలు, ప్రయాణీకుల సమాచారం నమోదు చేసి ఆన్‌లైన్ పేమెంట్ చేస్తే చాలు… టికెట్ వెంటనే బుక్ అవుతుంది. టికెట్ కాపీ కూడా వాట్సాప్ ద్వారానే అందుతుంది. ఈ సౌకర్యంతో ప్రయాణికుల సమయం ఆదా అవడమే కాకుండా, కౌంటర్ల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.