టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న 62 మంది ఉద్యోగుల జీతాలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు ఈ జీతాల పెంపు వర్తించనుంది. దీని ద్వారా ఆలయ సేవల్లో నిమగ్నమైన ఉద్యోగులకు ఆర్థిక భద్రత పెరగనుంది.
అర్చకులకు ప్రస్తుతం ఉన్న రూ.25 వేల జీతాన్ని రూ.45 వేలకు పెంచారు. ప్రసాదం డిస్ట్రిబ్యూటర్ల జీతం రూ.23,640 నుంచి రూ.30 వేలకు పెరిగింది. పోటు వర్కర్లకు రూ.24,279 నుంచి రూ.30 వేలుగా, పరిచారకుల జీతం రూ.23,140 నుంచి రూ.33 వేలుగా పెంచుతూ పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు ఉద్యోగుల్లో ఆనందాన్ని కలిగిస్తున్నాయి.
ఇదే సమావేశంలో ఉద్యోగాల భర్తీపై కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరీల్లో మొత్తం 60 పోస్టులను నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయనున్నారు. అలాగే శ్రీవారి పోటులో కొత్తగా 18 పోటు సూపర్‌వైజర్ (పాచక) పోస్టుల ఏర్పాటుపై ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని నిర్ణయించారు. తిరుమల ఆలయంలో సన్నిధి యాదవ పోస్టుల భర్తీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అలాగే తిరుమల, కాలిబాట మార్గాల్లో ఉన్న పురాతన ప్రాశస్త్యం గల నిర్మాణాల పరిరక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, అధికారులను నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. ఇది తిరుమల ఆలయ వారసత్వాన్ని కాపాడే దిశగా తీసుకున్న ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరిగిన ప్రారంభ సమావేశంలో పెద్ద జీయర్‌స్వామి, చిన్న జీయర్‌స్వామి ఆశీర్వచనాలు చేశారు. వేదాల సారమే తిరుప్పావై అని పేర్కొన్నారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి 2026 జనవరి 14 వరకు దేశవ్యాప్తంగా 233 ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.