అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పింఛన్ల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన సీఆర్డీఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. మొత్తం 4,929 మంది అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు తిరిగి అందించేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
రాజధాని గ్రామాల్లో ఉన్న సీఆర్డీఏ కార్యాలయాల్లోనే కాకుండా గ్రామసభల సందర్భంగా కూడా పింఛన్ దరఖాస్తులు తీసుకుంటున్నారు. సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు విడుదల చేసిన ప్రకటనతో భూమి లేని పేదల నుంచి భారీ స్పందన వచ్చింది. గ్రామసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు.
సోమవారం అమరావతి రాజధాని పరిధిలోని యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని పింఛన్ల కోసం వినతులు అందజేశారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు రూ.5,000 పింఛన్ అందించనున్నారు.
ఈ సందర్భంగా మొత్తం 3,298 పింఛన్ దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధికంగా నవులూరు నుంచి 1,150, యర్రబాలెం నుంచి 1,100 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. దరఖాస్తుదారుల నుంచి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు ఐడీ, బ్యాంక్ పాస్‌బుక్ ప్రతులు సేకరించారు.
భూసమీకరణ సమయంలో భూమి లేని పేదలకు పింఛన్లు అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించి అమలు చేసింది. తొలుత రూ.2,500గా ఉన్న పింఛన్ మొత్తాన్ని తరువాత రూ.5,000కు పెంచారు. అనంతరం కొందరికి పింఛన్లు నిలిచిపోవడంతో, 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పింఛన్ల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో గ్రామసభలు, సీఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.