రాజధాని అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించే దిశగా ప్రభుత్వం తీసుకోవాల్సిన కార్యాచరణపై ఈ సమావేశంలో స్పష్టమైన దిశానిర్దేశం జరిగింది. ముఖ్యంగా వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స చేయడం కంటే ముందుగానే నివారించే ప్రివెంటివ్ హెల్త్ విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను పూర్తిగా వినియోగించుకోవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి నిపుణుల సలహాలను విధానాల రూపకల్పనలో భాగం చేయాలని ఆయన పేర్కొన్నారు.
గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో అమలవుతున్న సంజీవని వంటి కీలక ఆరోగ్య ప్రాజెక్టుల పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రజల ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో డిజిటల్ హెల్త్ రికార్డుల రూపకల్పన జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటికే కుప్పం, చిత్తూరు జిల్లాల్లో డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి సమగ్రంగా అనుసంధానం చేశామని తెలిపారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా రియల్ టైమ్‌లోనే వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విధానం విజయవంతమైతే త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశం గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల సలహా బృందంతో సీఎం చంద్రబాబు తొలి భేటీ కావడం విశేషం. యూఎన్ఎయిడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ పాయిట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, ఎఐజీ ఛైర్మన్ డాక్టర్ డి. నాగేశ్వర్ రెడ్డి, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇక్ ఇంగ్ టియో, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్తి అహుజా, రిజ్వాన్ కొయిటా, శ్రీకాంత్ నాదముని, డాక్టర్ గగన్ దీప్ కాంగ్, మార్గరెట్ ఎలిజిబెత్, డాక్టర్ నిఖిల్ టాండన్ వంటి ప్రముఖులు వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ నిపుణులు ప్రజారోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై తమ అనుభవాలను పంచుకున్నారు.
సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ఆరోగ్య రంగంలో యోగా, నేచురోపతి వంటి పద్ధతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. డిజిటల్, ఏఐ ఆధారిత వైద్య సేవలు, హెల్త్ ఫైనాన్సింగ్ సంస్కరణలు, మెడ్‌టెక్ పార్కుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని చెప్పారు. ముందస్తు స్క్రీనింగ్, టాప్ 10 రోగాలపై విశ్లేషణ ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
నిపుణుల బృందం కూడా ప్రజారోగ్యంపై కీలక సూచనలు చేసింది. పౌష్టికాహారం, స్వచ్ఛమైన వాతావరణం, కాలుష్య నియంత్రణ వంటి అంశాలు ఆరోగ్యానికి కీలకమని సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ప్రజారోగ్యాన్ని కేవలం వైద్య పరంగానే కాకుండా సామాజిక కోణంలో కూడా చూడాలని పీటర్ పాయిట్ సూచించారు. ఏఐ, డిజిటల్ హెల్త్ ద్వారా సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చని పలువురు నిపుణులు పేర్కొన్నారు.
గేట్స్ ఫౌండేషన్ కంట్రీ డైరెక్టర్ అర్చనా వ్యాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు. నిపుణుల సూచనలను క్రోడీకరించి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే బాధ్యతను సీఎం ఆమెకు అప్పగించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ సలహాలు హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు దోహదపడతాయని అన్నారు.