ఆంధ్రప్రదేశ్‌లో 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన ప్రైవేటు పట్టా భూముల సమస్యలు చాలా కాలంగా రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. భూములను కొనుగోలు చేయడం, అమ్మడం వీలుకాక అనేక మంది రైతులు నష్టపోయారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టగా, అందులో భాగంగా ఏలూరు జిల్లాలో కీలక ముందడుగు పడింది.
ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో మెగా గ్రీవెన్స్ సెల్ నిర్వహించి, అన్ని మండలాల నుంచి రెవెన్యూ అధికారులు, బాధిత రైతులను పిలిపించి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని బాధితులతో మాట్లాడారు. రికార్డులను పరిశీలించి అనేక ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కేసులకు పరిష్కారం చూపించారు.
ఎన్నో సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని రైతులు తెలిపారు. అయితే మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలో ఒక్క రోజులోనే తమ సమస్యలు పరిష్కారం కావడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. దీర్ఘకాలంగా వెంటాడిన భూసమస్యలు తొలగిపోవడంతో బాధితులు ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇకపై 22ఏ భూముల సమస్యలపై ప్రతి నెలా గ్రీవెన్స్ నిర్వహిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. నిషేధిత జాబితా నుంచి తొలగించిన సర్వే నంబర్ల వివరాలను ప్రజలు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో పాటు అధికారులు మొత్తం 809 వినతులను స్వీకరించి పరిష్కారం చూపించారు.
దాదాపు నెల రోజుల పాటు చేసిన కసరత్తుతో ఈ సమస్యలకు పరిష్కారం లభించిందని అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో అమలు చేసిన విధానాన్ని మిగిలిన జిల్లాల్లోనూ అనుసరించాలని మంత్రి ఆదేశించారు. రెండు వారాల్లో రెవెన్యూ, దేవదాయ, రిజిస్ట్రేషన్ శాఖల సమన్వయంతో భూసమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు. దీంతో 22ఏ భూములపై నిషేధం తొలగి, భూముల కొనుగోలు–అమ్మకాలు స్వేచ్ఛగా జరగనున్నాయి.